January 8, 2013

పన్నుల కాంగ్రెస్‌కు కన్నీరే శాపం



ఆడపడుచుల కన్నీరు ఈ రాష్ట్రానికి శుభం కాదు. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రతి రోజూ ఏడిపిస్తోంది. పాదయాత్రలో భాగంగా, నర్సింహులుపేట సభలో కష్టాలు చెప్పాలంటూ ఒక మహిళకు మైకు ఇచ్చాం. మైకు అందుకున్న ఆమె నోటి నుంచి మాటలు రావడం లేదు. కళ్ల నుంచి ధారాపాతంగా నీళ్లు వస్తున్నాయి. ఆమె వలవలా ఏడ్చేస్తోంది. 'ఏడవకు తల్లీ.. నీ కష్టం ఏమిటో చెప్పు' అని ఓదార్చాను. "కరెంటు చార్జీలు చూస్తుంటే గుండె పగిలిపోతోందయ్యా. పన్నుల మీద పన్నులు వేస్తున్నారు.

నిత్యావసర ధరల పెరుగుదలకు అదుపు లేదు. రోజు కూలీ చేసుకునే మేం ఇవన్నీ ఎలా భరించగలం!? రేపో మాపో బస్సు చార్జీలు కూడా పెంచుతామని చెబుతున్నారు. ఇక, ఏడవక ఏం చేయమంటారు!?'' అంటూ బోరున విలపించింది. సమస్యలపై మహిళలు నిలదీయడం చూశాం. కానీ, ఇలా నిస్సహాయత వ్యక్తం చేసి, కన్నీటి పర్యంతం కావడం.. ప్రభుత్వాలకు శాపనార్థాలు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. నిజమే..! వారి ఆందోళనలో అర్థముంది. వారి ఆవేదన సబబే! వారి ధర్మాగ్రహం న్యాయమే! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 28 సార్లు పెట్రోలు మంట మండించారు.

ఎరువుల ధరలను 12 సార్లు పెంచారు. రాష్ట్రంలో మూడుసార్లు కరెంటు చార్జీల షాక్ ఇచ్చారు. సర్‌చార్జీలు అదనం. మద్యం ఆదాయంతో పేదల జేబుకు చిల్లు పెడుతున్నారు. రూ.3000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని రూ.30 వేల కోట్లు చేశారు. ఇప్పుడు మరో రూ.13 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారు. వ్యాట్, ఆర్టీసీ, కరెంటు, రిజిస్ట్రేషన్లు, ఇంటి పన్నులు, మంచి నీటి సెస్సులు.. ఇలా అన్నీ పెంచేయడంలో రికార్డు ఈ ప్రభుత్వానిదే. రూ.2471గా ఉన్న తలసరి పన్ను భారాన్ని ఈ ప్రభుత్వం రూ.8650కి పెంచేసింది.

నాటి వైఎస్ అవినీతి, నేటి కిరణ్ అవినీతి, అసమర్థత కలిసి పేదల పాలిట శాపంగా మారాయి. కడుపు మండి ఏదో ఒకరోజు ప్రజలు రోడ్లపైకి వస్తారు. పాలకులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం.