January 6, 2013

మహిళా పరిశ్రమ ఊరికే పోదు!



పేరుకి పావలా వడ్డీ అయినా రెండు రూపాయలు కడుతున్నాం. ఆర్థికంగా చితికిపోయాం. అప్పుల ఊబిలో కూరుకుపోయాం. మీరే ఆదుకోవాలి''.. నేను పాదయాత్రలో తిరిగిన ప్రతి పల్లెలో వినిపించిన డ్వాక్రా మహిళ ఆక్రందన ఇది. వాళ్ల ఆవేదన ఎంత న్యాయమైనదనేదీ, వాళ్ల వేదన వెనక ఎంత గుండె బరువు ఉన్నదీ పర్వతగిరిలో అడుగుపెట్టినప్పుడు గానీ నా ప్రత్యక్ష అనుభవంలోకి రాలేదు. ఆగ్రామంలోని ఓ భవంతి వద్ద పెద్దఎత్తున మహిళలు గుమిగూడటం కనిపించింది. దగ్గరకు వెళ్లి పలకరించాను.

వారు దారి చూపగా భవంతిలోకి వెళ్లాను. చూడబోతే చాలాకాలంగా వినియోగంలో లేనట్టుంది. వాళ్లూ అదే చెప్పారు. " మీరు సీఎంగా ఉండగా ఈ యూనిట్ పెట్టుకున్నాం. 2001లో డ్వాక్రా మహిళలకు మీరిచ్చిన ఆసరా.. మమ్మల్ని ఈ రంగంలోకి తెచ్చింది. కారంపొడి యూనిట్ పెట్టకొని మాతో పాటు పది మందికి ఉపాధి చూపగలిగాం. కానీ, ఇప్పుడు మేమే రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అప్పులు కట్టలేదని బ్యాంకు మా యూనిట్‌ను స్వాధీనం చేసుకుంది.

రూ. 5 లక్షలు కడితేగానీ తిరిగి మాకు అప్పగించబోమని అధికారులు చెబుతున్నారు సార్..'' అని వాపోయారు. వాళ్లు చెబుతుండగానే, యూనిట్ ప్రారంభోత్సవానికి నేను రాలేక, మా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును పంపిన సంగతి గుర్తుకొచ్చింది. వాళ్ల మాటలు కొంత సంతోషాన్ని, మరింత బాధను కలిగించాయి. నా చేతుల్లో రూపుదిద్దుకున్న ఇలాంటి యూనిట్లు మూతపడటం వ్యక్తిగతంగా నన్ను బాధించే అంశం. కాబట్టే.. యూనిట్ పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని చెప్పి ముందుకు కదిలాను.

కల్లెడ గ్రామంలో ఓ భారీ భవనం నన్ను ఆకర్షించింది. అది గతంలో దొరల గడి అని అక్కడి వారు చెప్పారు. ఇప్పుడు దాన్ని పిల్లల బడిగా మార్చినట్టు తెలుసుకొని ముచ్చటేసింది. లోపలకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపాను. నడిచిన అలసటంతా వారి సమక్షంలో తీరిపోయినట్టనిపించింది. నాటి దొరల పిల్లలు దాతలుగా మారి ఈ స్కూలును నడుపుతున్నారట. వారి కృషి, గ్రామస్తుల సహకారం కలగలిసి ఇప్పుడు ఈ బడి ఆదర్శ స్కూలుగా మారిందని చెప్పారు. పేద పిల్లలకు ప్రాధాన్యం ఇచ్చి చదువు చెబుతున్నారని తెలిసి యాజమాన్యాన్ని మనసారా అభినం దించాను.