January 6, 2013

ఇక టీడీపీ విద్యుత్ ఉద్యమం



చార్జీలపై యుద్ధమే!
పార్టీ నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు
ఏ మొహంతో పెంచుతున్నారు: నన్నపనేని

దాదాపు పదేళ్ళ కింద విద్యుత్ చార్జీల పెంపుతో అధికారం కోల్పోయిన టీడీపీ ఇప్పుడు అదే అస్త్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి వ్యూహరచన చేస్తోంది. ఇంధన సర్‌చార్జికి తోడు విద్యుత్ చార్జీలను పెంచాలని విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన నేపథ్యంలో.. రాష్ట్ర స్థాయిలో భారీ ప్రజా ఉద్యమానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఐదేళ్ల వరకూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ 2009 ఎన్నికల సమయంలో బహిరంగ ప్రకటనలు ఇచ్చి ఓట్లు వేయించుకొన్న కాంగ్రెస్... ఇప్పుడు దానికి విరుద్ధంగా చార్జీల మోత మోగించి ప్రజలను మోసం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై చేపట్టాల్సిన ఉద్యమం ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. మొదట తమ పార్టీపరంగా ఉద్యమం మొదలుపెట్టాలని.. రెండో దశలో ఇతర పార్టీలను కలుపుకొని వేడి పెంచాలన్నది టీడీపీ వ్యూహం. ఈ నెల రెండో వారంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. అందులో విద్యుత్ ఉద్యమమే ప్రధాన ఎజెండా కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 'ఏ రూపంలో తమ నిరసనలు ఉండాలి.. ఉద్యమాన్ని ఎలా పకడ్బందీగా రూపు దిద్దాల'న్న దానిపై ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం నెమ్మదిగా ఉద్యమాన్ని మొదలుపెట్టి సంక్రాంతి తర్వాత దానిని ఉధృతం చేసే అవకాశం ఉంది. కాగా.. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ.. నానా యాగీ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చార్జీలు పెంచుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. మరో ఐదేళ్ళ వరకూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొన్నారని, ఇప్పుడు వాటిని తుంగలో తొక్కి అడ్డగోలుగా పెంచుతూ పోతున్నారని ఆమె విమర్శించారు.

చార్జీల బాదుడుకు తోడు కరెంటు కోతలు ప్రజలను నానా అగచాట్లకు గురి చేస్తున్నాయని, పరిశ్రమలు, రైతులు, చిన్న వ్యాపారులు నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. భూముల పంపిణీపై మంత్రులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనం చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని నన్నపనేని వ్యాఖ్యానించారు. పేదలకు భూములు పంపిణీ చేస్తే డబ్బులు రావనే మంత్రులు దానిని పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.