February 19, 2013

చంద్రబాబు వేమూరులోనే..


చంద్రబాబు 48 గంటల పాటు వేమూరులోనే బస చేయనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర జిల్లా నేతలు ఎవరూ స్థానికంగా ఉండటానికి వీల్లేదన్న నిబంధనను సడలించాలని టీడీపీ జిల్లా నేతల విజ్ఞాపన మేరకు ఈసీ షరతులతో కూడిన అనుమతిని జారీ చేసింది. దీంతో నేడు(మంగళవారం) సాయంత్రం ఐదు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబు పాదయాత్ర తాత్కాలికంగా వేమూరు శివారులో నిలిచిపోనుంది. ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ రోజున సా యంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యకలాపాలు నిలిపేయాలి. అలానే ఇతర ప్రాంతాల నేతలు జిల్లాను విడిచి వెళ్లిపోవాలి.

ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ సురేష్‌కుమార్ వారం క్రితమే ఈ విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు తెలిపారు. అయితే తాము ఆయా తేదీల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమని, చంద్రబాబుకు మాత్రం జిల్లాలోనే బస చేసేలా అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదించగా సోమవారం సాయంత్రం ఈసీ నుంచి లేఖ వచ్చింది. చంద్రబాబు బస చేస్తే ఎ లాంటి అభ్యంతరం లేదని, అయితే కొ న్ని షరతులు పాటించాలని స్పష్టం చే సింది. ఎలాంటి ప్రచారం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపింది. నిషేదిత సమయంలో ఆయన పోలింగ్ కేంద్రం, గ్రామానికి కొన్ని కి లోమీటర్ల దూరంలో ఉండాలని పే ర్కొన్నది. ఒక సీనియర్ అధికారితో వీ డియో చిత్రీకరించాలని ఆదేశించిది.

చంద్రబాబు వేమూరులోనే బస చేసేందుకు ఈసీ అనుమతి రావడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తాము ఇప్పటివరకు ఎక్కడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించలేదని, ఎమ్మెల్సీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహించ లేదని, దీని వలనే ఈసీ తమ విజ్ఞాపనకు సంతృప్తి చెందిందని పుల్లారావు తెలిపారు. 48 గంటల విశ్రాంతి నేపథ్యంలో వచ్చే ఆదివారం కూడా పాదయాత్ర జరుగుతుందని, అలానే 21వ తేదీన సాయంత్రం కూడా ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇది ఇలా ఉంటే ఎండలు పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్ర ఉదయం పూట త్వరితగతిన ప్రారంభించే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతున్నది. మధ్యాహ్నం 2 గంటలకు విశ్రాంతికి నిలిచపోతున్నది. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు సాగుతోంది. ఎండలు, 21వ తేదీతో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో పాదయాత్ర మొదలయ్యే వేళలు, ముగిసే సమయంలో మార్పు ఉండొచ్చని తెలిసింది.