February 20, 2013

జనం దగ్గరకెళితే 'చెయ్యి' విరగ్గొడతారు!

ఒళ్లంతా అహమే!
కిరణ్‌కు పాలన నాస్తి.. ఫోజులు జాస్తి
వైఎస్ 'దోపిడీ'ని ప్రతి ఫైలులో మోస్తున్నాడు
అందుకే దొంగ ముసుగులో 'సహకారం'
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

ప్రజ ల వద్దకు కాంగ్రెస్ నాయకులు నేరుగా వెళితే 'చె య్యి' విరగ్గొట్టి పంపడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే సహకార సంఘాల ఎన్నికల్లో 'పరోక్ష' పద్ధతుల్లో గట్టెక్కిందని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కు ఒళ్లంతా అహమేనని, వైఎస్ దోపిడీని పాలనలో తు.చ.తప్పక కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం జం పని వద్ద ఆయన మంగళవారం పాదయాత్ర ప్రా రంభించారు.

చంపాడ సెంటర్, బూతుమల్లి మీదగా 6.8 కిలోమీటర్లు నడిచి, వేమూరు చేరుకున్నారు. అక్కడ ఉన్న స్టేషన్‌లోకి వెళ్లారు. డీఎస్ పీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. జీతాలెలా వస్తున్నాయి. .పీఆర్‌సీ అ మలు జరుగుతుందా? డ్యూటీలు ఎలా వేస్తున్నారు?.. అంటూ ఆరా తీశారు. మిలిటరీ క్యాంటీన్ వలే తమకూ ఉంటే బావుంటుందని వారు కోరగా, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చాక ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి కిరణ్‌పై విరుచుకుపడ్డారు.

"కిరణ్‌కు ఒళ్లంతా అహమే. ప్రజాసంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోడు. అంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడతారు. దేనికీ నేరుగా సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడతారు. వైఎస్ ప్రారంభించిన దోపిడీని ప్రతి ఫైలులోనూ కొనసాగిస్తున్నారు'' అని మండిపడ్డారు. పార్టీ నుంచి వలస పోతున్న నేతలంతా ఆయారామ్... గయారామ్‌లని పేర్కొన్నారు. "వారంతా తొలుత తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. ఇప్పుడు వాళ్లకు అమ్ముడుపోతున్నారు. ఇది చూస్తే చాలా బాధేస్తోంది. పార్టీ గుర్తుతో గెలిచి ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం లేకుండా చేస్తూ బరితెగించి పరోక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతోంది.

రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు కూ డా అదే పద్ధతిన నిర్వహించాలని యోచిస్తోంది. మొండి'చెయ్యి'తో నేరుగా ప్రజల వద్దకు వెళితే విరగ్గొడతారని తెలిసి దొంగ ముసుగేసుకొని వస్తోంద''ని ధ్వజమెత్తారు. సహకార ఎన్నికల్లో జగన్ పార్టీ, టీఆర్ఎస్ గల్లంతు అయ్యాయని, టీడీపీ గెలిచే స్థానాల్లో స్టేలతో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు. అందరూ కలిసి 'హస్తాన్ని' చితక్కొట్టి నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, మైనార్టీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికలకు పోయి ఉండకపోతే టీడీపీదే గెలుపు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీపై దయ తలిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎన్‌టీఆర్ తర్వాత జనం గుండెలో కొంత స్థానం తనకు ఇవ్వాలని కోరారు.