February 20, 2013

ఆ చావుల పాపం ఎవరిది?

ఆ నియోజకవర్గంలో ఏ పల్లెకి వెళ్లినా మురుగుకాలువలే ముందుగా కాళ్లకు తగులుతాయి. అన్నివైపుల నుంచి దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతుంది. వేమూరు ప్రాంతంలో మంచినీళ్ల కొళాయిలకే కాదు, చివరకు డ్రైనేజీ వ్యవస్థకూ నోచుకోని పల్లెలనెన్నింటినో చూశాను. దాదాపుగా ఈ గ్రామాలన్నీ మంచం పట్టాయి. ఇక్కడి ప్రజా ఆరోగ్య వ్యవస్థలు పడకేయడంతో అంటువ్యాధులు పడగ విప్పుతున్నాయి.

ఒక మాదిగ పేటకు వెళ్లి చూసినప్పుడు గానీ పారిశుద్ధ్య సమస్య పచ్చటి ప్రాంతాలను ఎలా కబళిస్తున్నదీ తెలియలేదు. రెండున్నరేళ్లలో 60 మందిదాకా ఈ పేటలో చనిపోయారని తెలిసి విస్మయం చెందాను. ఈ చావుల పాపం ఎవరిది? సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపని ప్రభుత్వానిది కాదా? అదే పంచాయతీ పాలకమండళ్లు ఉండి ఉంటే ఈ ఘోరాలు జరిగి ఉండేవా? పాలన లేదు..ఆరోగ్య సేవలూ అందవు.. మరి ఈ జనం ఎలా బతకాలి!

ఇచ్చేది తక్కువ.. కోతలు ఎక్కువ.. చెప్పుకొనేది మరింత ఎక్కువ.. ఇది కదా మన సర్కారు సంక్షేమం అసలు ముసుగు. జంపని గుండా పోతున్నప్పుడు కలిసిన ఆ రైతులు చెప్పిన విషయాలు.. ఆ ముసుగును బదాబదలు చేసేశాయి. ఎరువుల భారం, కరెంట్ షాకు కుంగదీస్తున్నాయట. వీళ్ల క్షేమం గానీ సంక్షేమం గానీ పట్టింది ఎవరికి? సబ్సిడీలను ఘనంగా అందిస్తున్నామని ఢిల్లీలో ఉన్నవాళ్లు చెబుతుంటే, ఈ రాష్ట్రంలో రైతుకు మాత్రం బతుకే గగనంగా మారింది.

నా హయాంలో ఆశని రగిలించిన యువతరం.. ఉపాధి, ఉద్యోగం లేక ఈనాడు రోడ్డున పడింది. "అయ్యా.. మనవరాలి కోసం ఉన్న భూమిని తాకట్టుపెట్టాను. ఆమెను ఇంజనీరింగ్ చదివించేందుకు ఉన్నదంతా అమ్మేశాను. ఇంత చేసినా ఏమి మిగిలింది? బిడ్డ బాగానే చదివింది గానీ, ఉద్యోగమే లేదు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా పలికిన నాథుడే లేడు'' అని ఆ ముసలవ్వ అన్న మాటలు ఎవరినైనా కదిలిస్తాయి..రాయి లాంటి ఈ సర్కారుని తప్ప..