February 2, 2013

అధినేత వెన్నంటి...

 పార్టీ జెండా అంటే ఆయనకు ప్రాణం. నాయకుడి మాట శిరోధార్యం. బాస్ చెప్పిన అభిప్రాయం నచ్చినా నచ్చకపోయినా బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్ అనుకుని కామ్ అయిపోతారు. పార్టీలో ఏ పని అప్పగిస్తే ఆ పనికి నూరుశాతం న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలోకి ఇలా వచ్చి అలా ఎమ్మెల్యేలు అయిపోయిన వారు ఉన్నారు, ఎంపీలు అయినవారూ ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేసి ఇతర పార్టీలలోకి వెళ్లి తమను పైకి తేచ్చిన నేతనే తిట్టిపోసే వారు కూడా చాలా మంది ఉన్నారు. ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉండి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా ఆయన మాత్రం సింపుల్‌గా ఉంటారు. అధికార పదవులేమి అనుభవించలేదు. అయినా ఆయనలో అసంతృప్తి కన్పించదు.

పార్టీలో ఎన్ని పనులు చేస్తున్నా, ఎప్పుడూ తెరమీదకు రారు. పబ్లిసిటీకి ఆమడ దూరంగా ఉంటారు. పదవుల కోసం ఆశపడే తత్వం కూడా కాదు. ఆయన కావాలనుకుంటే ఏదో ఒక పార్టీలో చేరి డబ్బుతో రాజ్యసభ సభ్యత్వం పొందగల స్థోమత కూడా ఉంది. అయినా ఆయన అధినేత గీచిన గీతదాటరు. నాకు ఇది కావాలని ఎవరిని అడగరు. అలగడాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌లు చేయరు. ఏం ఆశించకుండా, ఏ స్వార్థం లేకు ండా పార్టీలో తిరగడానికి కార ణం ఒకటుంది. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన కోరిక. 2004లో టీడీపీ ఓడిపోయి చంద్రబాబు గవర్నర్‌కు రాజీనామా సమర్పించి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చంద్రబాబుతో మళ్ళీ మిమ్మల్ని అరగంట క్రితం ఎలా ఉన్నారో (సీఎం) అలా చూసే వరకు మీ వెంటే ఉంటాను అని చేసిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోలేదు.

ఆ లక్ష్యం కోసమే ఇల్లువాకిలి వదిలి 122 రోజులుగా చంద్రబాబుతోపాటు పాదయాత్రలో తిరుగుతున్నారు. పాదయాత్ర ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటారు. వయసులో ఏమైనా చిన్నవారా అంటే ఇంచుమించు చంద్రబాబు వయసే ఆయనది. ఆయనకు వేరే పనేమీ లేదా అంటే రాష్ట్రంలోని అత్యంత సంపన్నులలో ఆయన పేరు కూడా ఉంటుంది. అనేక పరిశ్రమలకు ఆయన అధిపతి. అవన్నీ కుటుంబీలకు అప్పగించి తానుమాత్రం బాబు వెంట తిరుగుతున్నారు. ఈ రోజులలో ఇంత విధేయత ఉన్న నాయకుడు ఎవరా అని అనుకుంటున్నారా... ఆయనే గరికపాటి మోహనరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

పదవులు చాలా మందికి ఉంటా యి. కాని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారు అరుదుగా ఉంటారు. అటువంటి కోవలో మొదట కనిపించే వ్యక్తి గరికపాటి. పార్టీలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు గరికపాటి అంటే తెలియని వారు ఉండరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులలో గరికపాటి కూడా ఒకరు అయినప్పటికీ ఆయనలో ఎక్కడా ఆ ఛాయలే కన్పించవు. చిన్నవారితో, పెద్దవారితో అందరితో ఇట్టే కలసిపోతారు. బాబు పాదయాత్ర 122 రోజులుగా ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం నడవడానికి కారణమైన వ్యక్తులలో గరికపాటి కృషి చాలా ఉంది. చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ టీమ్ మొత్తం బస చేస్తుంది. ఆ క్యాంపు నిర్వహణ మొత్తం గరికపాటి చూసుకుంటారు.

అక్కడే చంద్రబాబు ఒక బస్సులో నిద్రిస్తే, ఆ పక్కనే మరో బస్సులో గరికపాటి నివాసం ఉంటుంది. బాబు ఉదయం రెడీ అయ్యేసరికి గరికపాటి సిద్ధంగా ఉంటారు. ఈలోగా చంద్రబాబు గరికపాటికి రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడాల్సిన పనులు కూడా చెబుతుంటారు. వారితో మాట్లాడి తిరిగి ఆ వివరాలను బాబుకు చెబుతారు. జిల్లాలలో ఎక్కడైనా వివాదాలు తలెత్తితే చంద్రబాబుకు గుర్తొచ్చే వ్యక్తులలో గరికపాటి ఒకరు. వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబుకు సన్నిహితులైన వారిలో చాలామందిని ఏదో ఒక ఎరవేసి తమ వైపునకు తిప్పుకోగలిగారు. కాని గరికపాటి మాత్రం దొరకలేదు.

కోట్లాది రూపాయిల వ్యాపారాలు ఉన్న గరికపాటికి వై.ఎస్. అనేక ఆఫర్‌లు ఇచ్చారు. ఆయన లొంగలేదు. దీంతో వేధింపులు మొదలై చివరికి తప్పుడు కేసులలో అరెస్టు చేయించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా గరికపాటి తనకు నచ్చిన పంధా వీడలేదు. తాను నమ్మిన పార్టీని, తనను నమ్మే నేతను వీడలేదు. ఈ రోజులలో కూడా ఇలాంటివారు ఉంటారా అని ఆశ్చర్యమేస్తోంది కదా.. కాని ఉన్నారు. నాలుగు రోజులు పాదయాత్రలో నడిస్తే నాకేమిటి అని ఆలోచించే నాయకులకు ఇలాంటి నేతలు స్ఫూర్తిదాయకం అవుతారని ఆశిద్దాం.