August 20, 2013

సమైక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలదీక్ష

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఉండి కాలువలో జలదీక్ష చేపట్టారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలు నీటి వనరులు కోల్పోతారని తాను ప్రజల కోసం నిరవధికంగా జలదీక్షకు పూనుకున్నట్లు ఆయన దీక్షకు ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉండి కాలువలో వలలు వేసుకొని వలపై కుర్చీవేసి దానిపై కూర్చున్నారు. ఉండి కాలువ ఎఫ్‌ఎస్‌ఎల్ 4.5 అడుగులు కాగా ప్రస్తుతం 4.0 అడుగుల స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే టివి రామారావు గోదావరి ఒడ్డున ఉన్న గోష్పాద క్షేత్రంలో బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ పొర్లు దండాలు చేశారు. 108 సార్లు ఈ ప్రదక్షిణ చేశారు. దేవాలయ ఆవరణలో మోకాళ్లపై కొద్ది దూరం నడిచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విధంగా సోనియా, యుపిఎ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరినట్లు చెప్పారు.