February 23, 2013

రుణమాఫీపై దొంగ మాటలు.. హామీలన్నీ హుళక్కే

చేనేతకు వైఎస్ చెల్లుచీటీ!
నేతలన్నల ఆత్మీయ భేటీలో చంద్రబాబు

చేనేతలకు రూ. 312 కోట్ల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పారని.. ఆయన హయాంలో చేనేతకు చెల్లుచీటి ఇచ్చారంటూ చంద్రబాబు విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారికి రూ.1000 పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, కారుమూరు, వరికుటేరు పాలెం క్రాస్ వరకు 16.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చేనేత వృత్తి దెబ్బతినడానికి ప్రపంచీకరణ ఒక కారణమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే నేత కార్మికులను చూడటం మరో కారణమన్నారు.

చేనేత వర్గాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను తాము అందిస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క ఎంపీని మాత్రమే చేసిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే, విద్యుత్‌లో రాయితీ ఇస్తామని, చనిపోయినవారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్‌కు తోడు గార్మెంట్ మిల్లులను ఏర్పాటు చేసి చేనేతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. తన అజెండాలో చేనేతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

సీఎం, పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగేవి కావని విమర్శించారు. ప్రభుత్వం పటిష్ఠం గా లేకపోయినా, పరిపాలనా అనుభవం లేని సీఎం ఉన్నా ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని చెప్పారు. కాగా, బ్రాహ్మణులను రాజకీయం గా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకొంటానని.. ఆ సామాజికవర్గం నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నుంచి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేత వేమూరి ఆనంద్‌సూర్య నేతృత్వం లో సంస్థ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం సాయం త్రం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లికి వచ్చారు. చంద్రబాబు వారితో ముఖాముఖీగా సమస్యలపై చర్చించారు. టికెట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే అంతకంటే ముందు మీరు మంచి నెట్‌వర్కును ఏర్పాటు చేసుకొని నాయకులుగా ఎదగాలని సూచించారు. స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు ఇచ్చి, వాటిల్లో పురోగతి ఆధారంగా ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.