October 7, 2012

పాదయాత్ర Day6...07.10.2012

"క్విట్ కాంగ్రెస్
కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయండి!
కాంగ్రెస్, వైసీపీలను దేశం నుంచి బహిష్కరిద్దాం
మీ కష్టాలు చూడలేక వచ్చా
రుణ విముక్తులను చేసే వరకు పోరాడతా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తా
చదువుకునే ప్రతి ఒక్కరికీ ఉద్యోగం"

 

అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, వైసీపీలను దేశం నుంచి బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. లక్షలాది కోట్ల ప్రజా ధనాన్ని తమ సొంత ఖాతాల్లో వేసుకుని జైలు పాలయ్యారని, భవిష్యత్తులో కేబినెట్ సమావేశాలు కూడా చంచల్‌గూడ జైల్లో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 2న తాను పాదయాత్ర ప్రారంభించానని, క్విట్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని 'క్విట్ కాంగ్రెస్' పేరిట ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బట్టలు ఉతికి ఆరేసినట్లు కాంగ్రెస్ నేతలను ఉతికి ఆరేయాలని రజకులకు సూచించారు.

ముప్పై ఏళ్లుగా టీడీపీని ఆదరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించి కష్టాలు తెచ్చుకున్నారని, మీరు పడుతున్న కష్టాలు చూడలేకే మీ వద్దకు వచ్చానని ప్రజలకు స్పష్టం చేశారు. రైతులను, ప్రజలను రుణ విముక్తులను చేసేంత వరకు పోరాడతానని, తాను ఒక్కసారి పట్టుబట్టితే వదలనన్న విషయం మీకూ తెలుసునని వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఆరో రోజైన ఆదివారం రాప్తాడు నియోజకవర్గం పేరూరు గురుకుల పాఠశాల నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టారు. అనంతరం మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గమైన కల్యాణదుర్గంలోకి అడుగుపెట్టారు.

అక్కడి అచ్చంపల్లి వద్ద చంద్రబాబు వంద కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరో రోజు 23 కిలోమీటర్లు నడక సాగించి కుర్లాపల్లి క్రాస్ వద్ద బస చేశారు. పాదయాత్రలో భాగంగా పేరూరు డ్యాంను పరిశీలించి డ్యాంకు హంద్రీ నీవా నీటిని తెప్పిస్తానని హామీ ఇచ్చారు. పేరూరు, చెన్నంపల్లి, ఒంటారెడ్డి తదితర గ్రామాల్లో కార్యకర్తలు చంద్రబాబుకు పూల బాట ఏర్పాటు చేయగా, మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు లక్ష్యంగా బాబు హామీలు గుప్పించారు. పది వేల కోట్లు ఖర్చు చేసి బీసీల ఎదుగుదలకు అన్ని విధాలా కృషి చేస్తానని, మైనార్టీల కోసం రూ.2500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

ముస్లిం యువతీ యువకులకు రూ.50 వేలతో ఉచితంగా పెళ్లిళ్లు చేస్తామన్నారు. జిల్లాలోని మంత్రులు ఒకరు మాయల మరాఠీ, మరొకరు మాటల మరాఠీ అని విమర్శించారు. మహిళల కన్నీళ్లు చూడలేక తాను దీపం పథకం ద్వారా 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించానని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ ధరను పదే పదే పెంచడమే కాకుండా సిలిండర్లపై నియంత్రణ కూడా పెట్టిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్య నియంత్రణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రారంభంలోనే గురుకుల పాఠశాల విద్యార్థులతో అరగంటకుపైగా మాటామంతీ కొనసాగించారు. తాను మళ్లీ అధికారం చేపడితే రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తానని, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

అనామలీస్ కమిటీని రద్దు చేసి పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ చోట్ల చంద్రబాబు మాట్లాడుతూ, ఎవడబ్బ సొమ్మని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అందిన కాడికి దోచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవినీతిపై పలువురు ఫిర్యాదు చేయడంతో, "కళ్లముందే కాంగ్రెస్ నేతలు నాలుగైదు ఇళ్లు కట్టుకుని ఇతరులకు ఇల్లు కూడా లేకుండా చేస్తే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఎవడబ్బ సొమ్మని దోచేస్తున్నారు?'' అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.
No comments :

No comments :