April 27, 2013

పసుపెక్కిన విశాఖ నేటితో ముగియన్ను బాబు పాదయాత్ర

సాయంత్రం బహిరంగ సభ..భారీ ఏర్పాట్లు

విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ, కోస్తాల్లో 16 జిల్లాలు, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల గుండా... 208 రోజుల పాదయాత్ర! 2817 కిలోమీటర్ల మహా పాదయాత్ర! 'వస్తున్నా మీకోసం' అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర... తుది మజిలీకి చేరుకుంది. శనివారం జరిగే పాదయాత్ర ముగింపు సభకు విశాఖ నగరం వేదికగా మారింది.

ఉక్కు నగరం పసుమయమైంది. ఎటు చూసినా రెపరెపలాడుతున్న పసుపు జెండాలు, పసుపు పచ్చ తోరణాలే! చంద్రబాబు శుక్రవారం రాత్రి కూర్మన్నపాలెంలోని సుజనా స్టీల్స్‌లో బస చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఒక కిలోమీటరు దూరం నడిచి అగనంపూడిలో ఏర్పాటుచేసిన పైలాన్ దగ్గరకు చేరుకుంటారు. సుమారుగా వెయ్యి గజాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన పైలాన్ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని, పాదయాత్ర ముగింపును సూచిస్తూ సందేశంతో కూడిన శిలాఫలకాన్ని, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పది వేల బైకులతో ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ వేదిక అయిన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. బహిరంగ సభలో చంద్రబాబు సుమారు గంటసేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఏడు నెలల పాటు ప్రజల మధ్య పర్యటించి తాను గుర్తించిన సమస్యలను, వాటికి పార్టీ తరఫున పరిష్కారాలను వివరిస్తారు.

పకడ్బందీ ఏర్పాటు సుమారుగా 16 ఎకరాల విస్తీర్ణం గల ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు లక్షల మందికి ఆ ప్రాంతం సరిపోతుందని పోలీసుల అంచనా. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభిస్తారు. సినీ నటుడు ఏవీఎస్, నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, సునీత, నాగూర్‌బాబు తదితరుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సందేశాత్మక గీతాలు, ఎన్టీఆర్ సినిమాల్లోని సామాజిక చైతన్య గీతాలను గాయకులు ఆలపిస్తారు.

రాత్రి ఏడుగంటలకల్లా సభను ముగించాలని పార్టీ అగ్రనాయకులు భావిస్తున్నారు. విశాఖపట్నానికి పొరుగునున్న నాలుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులను తరలించడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, గరికిపాటి మోహన్‌రావు, తదితరులు కొద్దిరోజులుగా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

13 రైళ్లు, 500కి పైగా బస్సులు, ఇతర వాహనాల్లో కార్యకర్తలు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డీసీపీ పర్యవేక్షణలో ఒక అదనపు డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, వందమంది ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లతోపాటు 400 మంది కానిస్టేబుళ్లు, ఒక ప్లటూన్ ఏఆర్ కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు.