April 27, 2013

ఛలో వైజాగ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర శనివారం విశాఖపట్టణంలో ముగుస్తున్న సందర్భంగా జరగనున్న చరిత్రాత్మక బహిరంగ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళాయి. ఇందుకోసం పార్టీ జిల్లా యంత్రాంగం రెండు ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు సొంతంగా కూడా వాహనాలు ఏర్పాటు చేసుకుని బయల్దేరి వెళ్ళారు. మొత్తంమీద జిల్లా నుంచి గురు, శుక్రవారాల్లో సుమారు 10 వేల మంది చంద్రబాబు సభకు వెళ్ళినట్టు అంచనా.

 తిరుపతి: 'రాబోయేది చంద్రన్న రాజ్యమే. ప్రజల కోసం కోసం మీరు చేసిన పాదయాత్ర చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. మీ శ్రమ వృథాకాదు. రాష్ట్ర ప్రజలూ మీ పాలన కోరుకుంటున్నారు. మీకు అండగా మేం ఉన్నాం. అందుకే విశాఖకు తరలి వస్తున్నాం' అంటూ తెలుగు తమ్ముళ్లు శుక్రవారం ఉత్సాహంగా విశాఖపట్నంకు రెండు ప్రత్యేక రైళ్లలో తరలి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'మీ కోసం వస్తున్నా' పాదయాత్ర శనివారం ముగుస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాదయాత్ర 2012 అక్టోబరు 2న అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం నుంచి ప్రారంభమై గురువారం నాటికి 206 రోజులకు చేరుకుంది.

అలాగే 2,800 కిలోమీటర్లను దాటేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నేతలెవరూ లేరు. ఈ యాత్ర ద్వారా పార్టీలో నూతనోత్సాహం నింపడంతోపాటు ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం బాబుకు లభించింది. అలాగే 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించడానికీ ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అనుబంధ సంఘాలను నియమిస్తున్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఓ నాయకుడిని ఈ సభకు తీసుకెళుతున్నారు. వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది క్రియాశీలక కార్యకర్తలు విశాఖ సభకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల నుంచి 2,800 మంది కార్యకర్తలు రెండు ప్రత్యేక రైళ్లలో విశాఖకు తరలివెళ్లారు. మరో 3వేల మంది వరకు ప్రత్యేక వాహనాల ద్వారా బయల్దేరారు. కార్యకర్తల కోసం చిత్తూరు, రేణిగుంటలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లా నుంచి సభకు వెళుతున్న కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారే కావడం గమనార్హం. జన సమీకరణకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సీనియర్ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే హేమలత, తిరుపతిలో నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి ఎంతో కృషి చేశారు.

20 కోచ్‌లతో

చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు

చిత్తూరు టౌన్: విశాఖలో నిర్వహించనున్న బహిరంగ సభకు చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం 20 కోచ్‌లతో ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇందుకోసం మధ్యాహ్నానికే కుప్పం, పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలతోపాటు మదనపల్లె, పుంగునూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చిత్తూరు చేరుకున్నారు. తొలుత స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి నేతలందరూ పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడినుంచి చిత్తూరు రైల్వేస్టేషన్‌కెళ్లి సాయంత్రం ప్రత్యేక రైలులో విశాఖకు తరలి వెళ్లారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, రాష్ట్ర కార్యదర్శి దొరబాబు, జిల్లా ఉపా«ధ్యక్షుడు కఠారి మోహన్, నేతలు మాపాక్షి మోహన్, బాలాజి నాయుడు, షణ్ముగం, వైవీ రాజేశ్వరి, అశోక్ ఆనంద్ యాదవ్, విల్వనాధం, దయారం, నీరజాక్షుల నాయుడు, కమలేష్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, రమేష్, యువరాజులు నేతృత్వంలో కార్యకర్తలను రైలు ఎక్కించారు. ఈ ప్రత్యేక రైలుకు టీడీపీ బ్యానర్లు, స్టిక్కర్లను, జెండాలను అతికించారు.

భోజనానికి అల్లాడిన కార్యకర్తలు: వందలాదిగా చిత్తూరుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు జిల్లా నాయకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైల్వేస్టేషన్‌లోనే భోజనం పెడతారని వేచి ఉన్నారు. అయితే చిత్తూరు నేతలు తమకేమీ సంబంధం లేదనడంతో హోటళ్లకెళ్లి భోజనం పొట్లాలు తెప్పించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జంగాలపల్లె శ్రీనివాసులు గురువారం ఉదయమే విశాఖపట్నంకు వెళ్లిపోవడంతో ఇక్కడ ఏర్పాట్లు చూసుకునే దిక్కు లేకపోయిందంటూ పలువురు వాపోయారు.