April 27, 2013

తెలంగాణలో అగ్నిపరీక్ష! సీమాంధ్రలో విషమ పరీక్ష! పేరుకు ప్రధాన ప్రతిపక్షమే అయినా... అనేక పక్షాలతో పోటాపోటీ!

తెలంగాణలో అగ్నిపరీక్ష! సీమాంధ్రలో విషమ పరీక్ష! పేరుకు ప్రధాన ప్రతిపక్షమే అయినా... అనేక పక్షాలతో పోటాపోటీ! ఈ బహుముఖ పోటీలో నిలబడతామా? పడిపోతామా? అనే సందేహం! వరుస ఉప ఎన్నికల్లో చేదు అనుభవాలు! ఇదీ... అప్పుడు తెలుగుదేశం పరిస్థితి! ఇలాంటి పరిస్థితిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర ఎలా సాగింది? ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? బాబు కష్టానికి ఫలితం లభించిందా? అనుకున్నది సాధించారా? ఆ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? 'ఆంధ్రజ్యోతి' విశ్లేషణ...

హైదరాబాద్ : 'పాదయాత్రా... అబ్బే కష్టం. ఈ వయసులో ఆరోగ్యం సహకరించదు'... అని కొందరు భయపెట్టారు. 'పాదయాత్ర అక్కర్లేదు. వాహన యాత్ర చేస్తే బాగుంటుంది' అని మరికొందరు అన్నారు. 'అబ్బే... ఇదంతా ఉపయోగం లేని వ్యవహారం' అని ఇంకొందరు పెదవి విరిచారు. ఇప్పుడు ఇదే నేతలు... 'చంద్రబాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది'... అని ముక్తకంఠంతో చెబుతున్నారు.

ఏడు నెలలపాటు అలుపెరగకుండా రాష్ట్రం ఆ కొస నుంచి ఈ కొస వరకూ ఆయన జరిపిన యాత్ర ఆ పార్టీకి నిజంగానే వర ప్రసాదంగా మారింది. ఆయన యాత్ర మొదలు పెట్టినప్పుడు అనేక మంది నేతలు లోలోపలే పెదవి విరిచారు. ఇప్పుడు యాత్ర ఫలితం గణనీయంగా ఉందని వారే అంగీకరిస్తున్నారు. 'వస్తున్నా మీకోసం' అని చంద్రబాబు యాత్ర మొదలుపెట్టడానికి ముందు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాజకీయ తుఫానులో చిక్కుకున్న చిగురుటాకులా ఉండేది.

ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటిసారి కొన్ని సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన దుస్థితి ఎదురైంది. ప్రత్యేకించి సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం ఆ పార్టీ వర్గాలకు శరాఘాతంలా తగిలింది. అవినీతి అజెండాకే విలువ లేకుండా పోయింది. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ కోలుకోవడం సాధ్యమేనా? అనే ఆందోళన పార్టీ నేతల్లో మొదలైంది.

ఈ పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయడానికి ఏదో ఒక సాహసం చేయక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించారు. మొదట్లో ఈ ప్రతిపాదనను పార్టీలో మెజారిటీ నేతలు వ్యతిరేకించారు. కానీ... చంద్రబాబు మాత్రం 'నిర్ణయం తీసేసుకున్నాను' అని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మూడున్నర నెలల్లో ముగించాలనుకొన్న యాత్రను... ఏడు నెలలపాటు నడిపించారు. కాలు పెట్టడమే కష్టమనుకొన్న తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర ఏకంగా మూడు నెలలపాటు సాగింది.

ఒక కదలిక... చంద్రబాబు అడుగు పెట్టిన ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొత్త ఊపిరి పోసుకుంది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులు లేచి నిలుచున్నాయి. ఈ ఉత్సాహం యాత్ర మధ్యలో వచ్చిన సహకార ఎన్నికల్లో ప్రతిఫలించింది. రెండు జిల్లా సహకార బ్యాంకులను గెలుచుకోవడంతోపాటు నాలుగైదు జిల్లాల్లో గణనీయ సంఖ్యలో సీట్లను సాధించగలిగింది. ఈ యాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి రైతు రుణాల మాఫీ హామీ విస్తృతంగా ప్రచారం పొందింది.

'ఈసారి పంట రుణాల బకాయిలు కట్టాలా వద్దా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలను రైతులు ప్రశ్నించారు. టీడీపీ వస్తే బకాయిలు మాఫీ చేస్తుందన్న నమ్మకం కుదరడం వల్లే ఇలా ఆరా తీశారు' అని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. జనం మధ్య నడుస్తూ, జనంలోకి వచ్చి మాట్లాడటం వల్లే చంద్రబాబు మాటలపై ప్రజలకు గురి కుదిరిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. 'ఇవే హామీలు ఆయన హైదరాబాద్‌లో కూర్చుని చెబితే అంత ప్రభావం చూపేవి కావు. ఆయన శ్రమపడి పాదయాత్ర చేస్తూ ఇస్తున్న హామీలు కావడంతో వాటిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు.

ఏడు నెలల పాదయాత్ర తర్వాత చంద్రబాబు ఒకటి మాత్రం స్పష్టంగా సాధించగలిగారు. వచ్చే ఎన్నికల్లో అధికార సాధనలో టీడీపీ బలమైన పోటీదారుగా ఉందని, పక్కన పెట్టే పరిస్థితి లేదని ఇతర పార్టీలు కూడా అంగీకరించే పరిస్థితి తెచ్చారు. 'తమదే ప్రభంజనం అని చెప్పిన పార్టీలు ఇప్పుడు గొంతు తగ్గించుకొన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండవచ్చు. కానీ అన్ని ప్రాంతాల్లో వాటికి బలమైన పోటీదారుగా ఉన్నది మేమే. ఇంకా ఏడాది సమయం ఉంది. ఇతరులు క్రమక్రమంగా తగ్గుతుంటే మేం రోజురోజుకు పుంజుకుంటున్నాం' అని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

మరుగున పడిపోయిన అవినీతి అజెండాను మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా చంద్రబాబు విజయం సాధించారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పారు. 'పాదయాత్ర ప్రారంభంలో చంద్రబాబు ఒక్కరే అవినీతి గురించి మాట్లాడేవారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తుతున్న అంశాలకు భయపడే వైసీపీ పోటీగా షర్మిల పాదయాత్రను మొదలు పెట్టించింది. ఆయనను చూసి ఎంత భయపడుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం' అని టీడీపీ నేత ఒకరు తెలిపారు. బాబు పాదయాత్ర పురోగమిస్తున్న కొద్దీ వలసలు తగ్గుముఖం పట్టడం మరో విశేషం.

యాత్రా సమయంలోనూ ఇద్దరు ముగ్గురు నేతలు వెళ్లిపోయినా కింది స్థాయిలో పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడుతున్నాయని, వలసలను చూసి తాము ఆందోళన పడాల్సిన పరిస్థితి తగ్గిపోయిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు అన్నారు. 'వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపని మేం డంబాలు కొట్టుకోవడం లేదు. బాగా దెబ్బతిన్న పరిస్థితి నుంచి నువ్వా నేనా అన్న స్థితిలోకి వచ్చాం. అదేమీ చిన్న విషయం కాదు. దానిని చంద్రబాబు సాధించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కష్టపడితే ఫలితం ఉంటుందన్న ధైర్యం వచ్చింది' అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.