January 31, 2013

జనం మధ్యే కోలుకుంటా..

పచ్చటి మొక్కలను గానీ, ఆ రంగులో ఉన్న ఏవైనా దృశ్యాలను గానీ చూడాలని అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యులు సూచిస్తారు. పాదయాత్రను పునఃప్రారంభించిన నాకు తొలి అడుగులోనే విద్యార్థులు ఎదురుకావడం అలాంటి 'పచ్చటి' హాయి కలిగించింది. నాలుగు రోజుల తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి

చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఇప్పటికీ నియంత్రణలోకి రాలేదు. కాలు మెలిక పడినప్పుడు చీలమండ వద్ద బెణికింది. ఆ నొప్పి ఇంకా సర్దుకోలేదు. మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. కానీ, జనం మధ్యనే నాకు నిజమైన విశ్రాంతి! వారితో ఉంటేనే మిన్నగా కోలుకుంటాననిపిస్తోంది. పైగా, వాళ్ల సమస్యలపై మనసు పెడితే నా బాధలు కాస్త నెమ్మదిస్తాయనేది ఒక ఆలోచన. దానికోసం 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రను..మరింత ముందుకు తీసుకెళుతున్నా!

పేరుకే విశ్రాంతి. నడక లేదనే గానీ, ఈ నాలుగు రోజులూ ప్రజలను కలుసుకుంటూనే ఉన్నాను. కాకపోతే, ఇప్పటిదాకా నేనే వాళ్ల దగ్గరకు పోయేవాడిని. ఇప్పుడు వాళ్లే నా దగ్గరకు వచ్చారు. టీచర్ల నుంచి హోటల్ వర్కర్స్ దాకా బృందాలుగా వచ్చి కలిశారు. వ్యాట్ రద్దు పోరాటంలో తమకు మా పార్టీ ఇచ్చిన మద్దతుకు వస్త్ర వ్యాపారుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఇంత చేసినా వాళ్ల సమస్య మాత్రం అలాగే ఉంది.

వాళ్లనే కాదు, ఉద్యోగుల నుంచి వృత్తిదారుల దాకా ఎవరినీ పట్టించుకొని పరామర్శించే పరిస్థితిలో ఈ పాలకులు లేరు. పన్నులు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీళ్లకు ప్రజలనేవారు గుర్తుకు వస్తారా అసలు? "మరి మీరు మాత్రం ఏమి చేస్తారు? ఢిల్లీ గ్యాంప్ రేప్ పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారు'' అని ఆ విద్యార్థిని దాదాపు నన్ను నిలేసింది. ఆ రేపిస్టులను ఉరి తీయాలన్న ఆవేశం పరిటాలలో కలిసిన విద్యార్థినుల్లో కనిపించింది. చట్టాల్లో మార్పులు రాకుండా వీళ్లకీ చెర వీడదు!