January 31, 2013

పాదయాత్ర పునఃప్రారంభానికి బాబు రెడీ

నేటి నుంచి మళ్లీ నడక

టీడీపీ అధినేత చంద్రబాబు కాలు నొప్పి కాస్త ఉపశమించింది. షుగర్ లెవల్స్ మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. అయినా, చంద్రబాబు తన పాదయాత్రను గురువారం నుంచి పునఃప్రారంభించనున్నారు. ఇకనుంచి రోజుకు పది కిలోమీటర్లు మించి నడవరాదని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 117 రోజులపాటు నడక సాగించిన చంద్రబాబు సుమారు 1860 కిలోమీటర్లు పర్యటించారు.

ఈనెల 26న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్నారు. కాలు నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్ లెవల్స్ పెరగడంతో ఎనిమిది నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చెప్పినా.. ససేమిరా అన్న బాబు.. నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుందని వారికి నచ్చచెప్పారు. బుధవారం సమన్వయ కమిటీ సభ్యులతో బస్సులోనే రెండు గంటలపాటు చర్చించారు. గురువారం ఉదయం 11 గంటలకు తనతోపాటు 117 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద దళాలు, పోలీసులు తదితరులను ముఖాముఖి కలుస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి రామమోహనరావు తెలిపారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు బస చేసిన ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ఉన్న మూలపాడు గ్రామం వరకు కాలి నడకన వెళతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 9.7 కిలోమీటర్లు నడుస్తారు. రెండో తేదీన వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచనను బట్టి ఎన్ని కిలోమీటర్లు వెళ్లాల్సింది నిర్ణయిస్తారు. వైద్యుల సూచనలను బట్టి పాదయాత్ర దూరాన్ని పెంచడమో లేదా తగ్గించడమో అన్నది ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు కాలునొప్పి కొంత ఫర్వాలేదని గరికపాటి చెప్పారు.