February 1, 2013

అధికారం ఖాయం..బాధలే తొలగడం తథ్యం

  కష్టకాలంలోనే డీలా పడకుండా ధైర్యంగా ఉండాలని.. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. మహిళల కష్టాలు తొలగడం తథ్యం.. అని అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన జిల్లా తెలుగు మహిళ నాయకురాలు తంగిరాల పద్మావతి ఆధ్వర్యంలో పలువురు మహిళలు చంద్రబాబును కల్సి సమస్యలను ఏకరవుపెట్టారు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని, బిల్లులు మాత్రం వేలల్లో వస్తున్నాయని వాపోయారు. రోజంతా కష్టపడితే వచ్చే కూలితో ఒక పూట గడవటం కష్టంగా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో లేవని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి బాధలు విన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి మీ సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.

తొలుత బస్సు నుంచి చంద్రబాబు బయటకు రాగానే పరిటాలకు చెందిన చింతల కృష్ణకుమారి, డాక్టర్ పసుపులేటి వీరాస్వామి గుమ్మడికాయతో దిష్టి తీశారు.గ్రీన్‌వేలో మొక్క నాటిన చంద్రబాబు.... క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని చంద్రబాబు కోరారు. పరిటాల వద్ద జాతీయ రహదారి పక్క న ఉన్న గ్రీన్‌వేలో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి విదితమే. అందుకు గుర్తుగా గ్రీన్‌వే సంస్థ ఎండీ సాదినేని సురేష్‌బాబుతో కలిసి ఎర్రచందనం మొక్కను నాటారు. 'ఏపీయూడబ్ల్యూజే' డైరీ ఆవిష్కరణ... ఏపీయూడబ్ల్యూజే జిల్లా యూనిట్ 2013 డైరీని చంద్రబాబు ఆవిష్కరించారు. శిబిరం వద్ద గురువారం బాబు, యూనియన్ నాయకులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చావా రవి, నగేష్, గంగిరెడ్డి రంగారావు, వెంకట్రావు, విజయకుమర్ పాల్గొన్నారు. ఫోటో షెషన్ చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు తదితరులు పోటీపడ్డారు.

ఆయన ఎంతో ఓపికగా సుమారుగా రెండు గంటల సేపు ఫోటో షెషన్‌లో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి ఆయనతో వెన్నంటి ఉంటూ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, వంటవాళ్లు, వ్యక్తిగత సహయకులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరత్రా వర్కర్లు రేయింబవళ్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతి వాహనం వద్దకు వెళ్లి చిన్న పెద్ద అనే తేడా ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలుకరిస్తూ, వారి భుజాలపై చేతులు వేసి ఫోటోలు దిగారు.