February 1, 2013

హైదరాబాద్‌ను ఇచ్చేస్తే.. మా గతేమిటి సార్..!

చంద్రబాబును ప్రశ్నించిన విద్యార్థినులు

"సార్.. మీరు హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఐటీ పార్క్‌ను తెచ్చి ఐటీ, కంప్యూటర్ ఇంజనీర్ కోర్సులు చేయడానికి మాలో ఉత్సాహం నింపారు. మీ ప్రోద్బలంతో ఉద్యోగాలు వస్తాయని మేము చదువుకుంటున్నాం. ఇప్పుడేమో తెలంగాణ సెంటిమెంట్ వాదానికి మీరు ఒప్పేసుకున్నారు. నాలాంటి వారు ఇంక ఎక్కడ ఉద్యోగాలు చేయాలి. మా పరిస్థితి ఏమిటి?'' ..చంద్రబాబు ఎదుట ఓ బీటెక్ విద్యార్థిని ఆవేదన ఇది.

తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన బాబుపై విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ సహా అనేక విషయాలపై ఆయన అభిప్రాయాలను రాబట్టారు. బాబు పాదయాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లినప్పుడు జరిగిన ఘటన ఇది. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చంద్రబాబు ఇప్పటికే వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో.. గీతాంజలి అనే (బీటెక్ 4వ సంవత్సరం) విద్యార్థిని ముందుకొచ్చి, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి పనులు చేపట్టారని, ఇలాంటప్పుడు తాము ఎక్కడకు పోవాలని ఆవేదనతో ప్రశ్నించారు.

"సీఎంగా చేసిన సమయంలో హైదరాబాద్‌లో బాండ్ విడ్త్ లేక అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలేవీ రాలేకపోయాయి. ఆ లోపాన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌కు కనెక్టివిటీని అభివృద్ధి చేసి సాఫ్ట్‌వేర్ సిటీగా చేయగలిగాను. హైదరాబాద్ తరువాత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకూ కనెక్టివిటీ తీసుకొచ్చి ఐటీ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్న దశలోనే ఎన్నికలొచ్చిఓడిపోయాం'' అని బాబు బదులిచ్చారు. విజయవాడలో సాఫ్ట్‌వేర్ టెర్మినల్ పార్క్‌ను తమ హయాంలో తలపెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకొనేలేదన్నారు.

"మీ ఊళ్లలోనే మీరు ఉద్యోగాలు చేయాలనేది నా కోరిక'' అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో నాలెడ్జ్ పార్క్‌లకు ప్రాధాన్యమిచ్చామని, దానివల్ల లక్షల మందికి సాంకేతిక రంగంలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయని, ఉద్యోగాలు రావడం తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉన్నదని, ఇప్పుడు అవినీతిని ఎదుర్కోలేకపోతే ఆఫ్రికాలాగా అయిపోతామని హెచ్చరించారు. టీడీపీని అధికారంలోకి తెస్తామని యువతీ యువకులు మాటలు చెబితే చాలదని, రోడ్డెక్కి ప్రజలను అవినీతిపై చైతన్యం చేయాలని కోరారు.