February 1, 2013

మంత్రి బోనెక్కితే పరువు పోలేదా!: టీడీపీ

'సీబీఐ పెట్టిన కేసులో నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి పట్టుబట్టి ఆపారు. ఇప్పుడు అదే మంత్రి బోనెక్కి చేతులు కట్టుకొని న్యాయ మూర్తి ముందు తల వంచి నిలబడితే ప్రభుత్వం పరువు పోలేదా? అవినీతిపరులను కాపాడటానికి ఈ సీఎంకు అంత ఆరాటం ఎందు కు?' అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ నేతలు రావులపాటి సీతారామారావు, కంభంపాటి రామ్మోహ నరావు గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఏ రోజు ఏ మంత్రి జైలుకు వెళ్తాడో తెలియని పరిస్థితి నెలకొందని రావులపాటి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సమావేశాలను చంచల్‌గూడ జైలులో పెట్టుకొనే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు ఆంధ్రా, తెలంగాణ పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలం గడుపుతున్నారని, విద్యుత్, ఆర్టీసీ వంటి చార్జీలు వడ్డించడానికే మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని కంభంపాటి రామ్మోహనరావు విమర్శించారు.

గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఆధార్‌తో లంకె పెట్టడాన్ని టీడీపీ నేతలు నిరసించారు. సిలిండర్‌కు వెయ్యి రూపాయలు ముందు వసూలు చేసి తర్వాత సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామనడం పిచ్చి తుగ్లక్ వ్యవహారం మాదిరిగా ఉందని విమర్శించారు. కాగా.. తన పాదయాత్రను శ్రీకాకుళంలోనే ముగించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారని, అన్నీ అనుకూలిస్తే అలాగే జరుగుతుందని కంభంపాటి రామ్మోహనరావు పేర్కొన్నారు.