February 1, 2013

చదవులకిది చేటు కాలం!

ఈ రాష్ట్రంలో యువత కోసం నేను కన్న కలలన్ని కల్లలయ్యాయి. వాళ్లకు బంగారు భవి ష్యత్తు ఇవ్వాలని నేను వేసిన పునాదులు చెదిరిపోయాయి. రాష్ట్రానికి సీఎంలా కాదు, ఒక సీఈ వోలా వ్యవహరిస్తున్నాడంటూ అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అయి ఉండి ఫైళ్లు చంకలో పెట్టుకొని దేశ,విదేశాలు తిరిగాను. ఎవరికోసం? న్యూయార్క్ వంటి నగరంలో వీధుల్లో నడుచుకుంటూ వెళ్లాను.

ఎందుకోసం? ఈ రాష్ట్రం, ఈ విద్యార్థుల కోసమేకదా? ఈ రాష్ట్రానికి ఏమి అవసరం..చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలంటే ఏమి చేయాలంటూ శాశ్వత ఆలోచనలు చేశాను. నిరుద్యోగాన్ని తొలగించడానికే కాదు.. నాణ్యమైన కొలువులను రాష్ట్రానికి తెచ్చుకునేందుకూ పరితపించాను. మారుతున్న ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏఏ రంగాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయో ముందుచూపుతో గ్రహించి అందుకు తగిన విద్యను ప్రోత్సహించాను.

పాదయాత్రగావెళ్లి ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతుండగా ఇదంతా గుర్తుకు వచ్చి, గుండె కలుక్కుమంది. "సార్! మీ హయాంలో మా గురించి పట్టించుకున్నారు. ఏది చేసినా మా విద్యకూ, ఉపాధికే ప్రాధాన్యమిచ్చి, విధానాలు రూపొందించారు. అప్పటి మీ భరోసాతో ఐటీలో భవిష్యత్తు ఉంటుందని ఆ కోర్సును ఎంచుకున్నాను. ఇప్పుడు చదువులు పూర్తవుతున్నాయి. కానీ, ఉద్యోగం దొరికే పరిస్థితి కనిపించడం లేదు'' అని ఓ విద్యార్థిని ఆవేదన చెందింది.

"ఎలాగైనా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మాకు ఉద్యోగాలు గ్యారంటీ ఇస్తారా'' అని ఆ చెల్లెలు అడుగుతుంటే, ఆ కళ్లలో భవిష్యత్తు పట్ల బెంగ కనిపించింది. వీళ్లను చూస్తుంటే.. ఇది నేను అభివృద్ధి చేసిన రాష్ట్రమేనా అని అనుమానం కలుగుతోంది. విద్యకు పెద్దపీట వేసిన ఆ కాలం ఛాయలు ఇప్పుడెక్కడ? అన్నదాత బిడ్డలను కూడా ఐటీ నిపుణులుగా మార్చిన ఘనత మాది. ఇప్పుడు ఏ వర్గానికీ విలువ లేదు. చదువుకు ఇది చేటుకాలమే!