February 1, 2013

టీఆర్ఎస్‌కు బేషరతు మద్దతు: ఎర్రబెల్లి

పట్టించుకోకుంటే మీకూ అదే పరిస్థితి
పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్య
ఎవరితో కలిసేది లేదని స్పష్టీకరణ

  'సహకార ఎన్నికల్లో కిందిస్థాయి నేతలకు పదవులు వస్తాయి. వారిని ఈ ఎన్నికల్లో గెలిపించడానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గట్టి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే తర్వాత వారు మీ కోసం పనిచేస్తారు. మీరు పట్టించుకోకపోతే తర్వాత వాళ్లూ మిమ్మల్ని పట్టించుకోరు. ఈ విషయం గుర్తుంచుకొని పనిచేయండి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనేక జిల్లాల్లో పార్టీ నేతలు సహకార ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలివిడత ఎన్నికల్లో ఊహించినదానికన్నా పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చినందుకు పార్టీ నేతలను అభినందిస్తూనే నేతలు గట్టి ప్రయత్నం చేసి ఉంటే ఫలితాలు ఇంకా బాగుండేవన్నారు. మంచి ఫలితాలు తెచ్చిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నేతలను ఆయన ప్రశంసించారు. ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఉన్నా ఆ స్థాయిలో ఫలితాలు కనిపించనందుకు మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల నేతలకు చురక వేశారు.

అంతర్గత తగాదాలు మాని పార్టీ పని కూడా చేయాలని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సహకార ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పనిచేసే సమస్య లేదని, టీడీపీ ఒంటరిగానే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని పార్టీనేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన ప్రకటన ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 'మనం ఎవరితోనూ కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. మన పని మనం చేద్దాం. మన దారిలో మనం వెళ్దాం. ఇలాంటి ప్రకటనలు చేయొద్దు' అని ఆయన సూచించారు.

వరంగల్ జిల్లాలో పార్టీకి చాలా పెద్ద నాయకులు ఉన్నారని, కానీ ఆ స్థాయిలో ఫలితాలు కనిపించట్లేదని అన్నారు. కాగా.. అంతకుముందు వరంగల్ జిల్లా తొర్రూరులో టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తొర్రూరులో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాలేదని, చైర్మన్ ఎంపిక కోసం టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు పదవులు అక్కర్లేదని, తొలివిడతలో టీఆర్ఎస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కాగా.. తమ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి సహకార ఎన్నికల తొలివిడత ఫలితాలు అద్దం పట్టాయని టీడీపీ వ్యాఖ్యానించింది.

తొలి విడతలో టీడీపీ ఖాయంగా గెలుస్తుందనుకొన్న 90 సొసైటీల్లో ఎన్నికలపై ప్రభుత్వం స్టే ఇచ్చిందని, అలా ఇవ్వకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి, మీడియా విభాగం చైర్మన్ ప్రసాద్ చెప్పారు. 'తొలి విడతలో మాకు 408 సొసైటీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 544 వచ్చాయి. స్టేలు ఇచ్చిన సొసైటీల్లో ఎన్నికలు ఉంటే మా సంఖ్య కనీసం 490 అయ్యేది. మా సమాచారం ప్రకారం వైసీపీకి 172, టీఆర్ఎస్‌కు 51 వచ్చాయి' అని పెద్దిరెడ్డి వివరించారు.