February 1, 2013

సొంత ఇలాకాలో పట్టు నిలుపుకొన్న కిరణ్, చంద్రబాబు

తొలివిడత సహకార ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పట్టు నిలుపుకొన్నారు. కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాల్లో గురువారం సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. పీలేరు పరిధిలో ఆరు సహకార సంఘాలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దశలోనే పీలేరు, కె.వి.పల్లె, కలికిరి సహకార సంఘాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన కలకడ, వాల్మీకిపురం, గుర్రకొండ మండలాల పరిధిలోని సహకార సంఘాల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవం కాగా.. కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. వాటిలో ఎక్కువ స్థానాలు సాధించడంతో.. ఈ మూడు సంఘాలు కూడా కాంగ్రెస్ పరమయ్యాయి. ఇక చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇవే తరహా ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు ఈ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోకున్నా నియోజకవర్గంతో పాటు పక్కనున్న పలమనేరు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఆధిక్యత సాధించడం గమనార్హం. కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె సహకార సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది.

పునర్విభజనకు ముందు వరకు కుప్పంలో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో కలిసిన వి.కోట మండల పరిధిలో జరిగిన రెండు సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. దాంతో పాటు పలమనేరు సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీ ఆరు వార్డులు గెలుచుకుంది. ఈ సంఘం పరిధిలో వైసీపీ ఆరు వార్డులు, కాంగ్రెస్ ఒక వార్డు గెలుచుకున్నాయి. అధ్యక్ష ఎన్నికలో కాంగ్రెస్ సభ్యుడు టీడీపీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన సంఘాల్లో మూడింట రెండొంతుల సంఘాలు టీడీపీ ఖాతాలో జమవుతాయి.