February 1, 2013

ఐదు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం

తొలి దశలో ఫర్యాలేదంటున్న నేతలు
సహకార ఎన్నికల్లో వైసీపీ గాలి అంతంతే

సహకార ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. వివిధ జిల్లాల నుంచి ఫలితాల సమాచారం సేకరించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాలు ఈ విషయం తెలిపాయి. ఖమ్మం, రంగారెడ్డి, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు ఈ సమాచారం సూచిస్తోంది. రాయలసీమ మినహా మిగిలిన చోట్ల అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. సీమలో మాత్రం వైసీపీ - కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కోస్తా, తెలంగాణల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. తెలంగాణలో రెండు మూడు జిల్లాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య నెలకొంది.

ఈ ఎన్నికల్లో తమ పార్టీ పనితీరు ఫర్వాలేదని, ఈ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఐదు జిల్లాల్లో ఆధిక్యం రావడం గొప్ప విషయమని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. "సహకార ఎన్నికల్లో సాధారణంగా అధికారపార్టీనే గెలుస్తుంది. అధికారులు వారి చేతిలో ఉండటం వల్ల తమవారిని అధికసంఖ్యలో సభ్యులుగా చేరుస్తారు. ఈ పరిస్ధితుల్లో కూడా మేం ఇన్ని సీట్లు సాధించడం మాటలు కాదు.'' అని టీడీపీనేత ఒకరు పేర్కొన్నారు. సీమాంధ్రలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఆ ఊపును చూపించలేకపోవడం ఆ పార్టీ బలహీనపడుతోందనడానికి నిదర్శనంగా కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు.

"సీమాంధ్రలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా జగన్ పార్టీ ప్రభంజనం వీస్తుందని చాలామంది భావిస్తారు. అది నిజం కాదని ఈ ఎన్నికల్లో రుజువైంది. కాంగ్రెస్ మరీ బలహీనపడలేదని, కొంత నిలదొక్కుకోగలుగుతోందని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ గాలి అంత ఎక్కువ లేదన్న విషయం కనిపిస్తోంది.'' అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. తెలంగాణలో రెండు జిల్లాల్లో, కోస్తాలో మూడు జిల్లాల్లో తాము ఆధిక్యంలో నిలవడం టీడీపీ నేతలకు సంతృప్తినిస్తోంది.