August 2, 2013

సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మహానగరం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి!బాబుతోనే అభివృద్ధి సాధ్యం!


సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మహానగరం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఇది టిడిపి కొత్త నినాదం. సంక్షోభంలో సైతం రాజకీయ పక్షాలు అవకాశాలను వెతుక్కుంటాయి. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు అంశంతో సీమాంధ్రలో ఒకవైపు ఆందోళనలు సాగుతుండగా, టిడిపి నాయకులు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి నగరం కోసం చంద్రబాబు నాయకత్వం అవసరం అనే నినాదంతో తెలుగు యువత ప్రచార పోస్టర్లు రూపొందించి, అప్పుడే ప్రచారంలోకి తీసుకువచ్చారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఈ ఎన్నికల వరకు తెలంగాణలో అధికారంలోకి రావడంపై టిడిపి పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. అయితే అదే సమయంలో విభజన అంశం వల్ల సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి ఉపయోగించుకోవచ్చునని టిడిపి నాయకులు భావిస్తున్నారు.

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా కనిపించి ఉండవచ్చు కానీ ఈ సంక్షోభ సమయంలో టిడిపి సరిగ్గా ప్రచారం చేసుకుంటే ఆ ప్రాంతంలో విజయం సాధించడానికి అవకాశం ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు. సాధారణంగా సీమాంధ్రలో ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రాధాన్యత ఎక్కువ. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు సాధారణ సమయంలో జరుగుతున్నవి కాదు కాబట్టి ఈసారి సామాజిక వర్గాల ప్రభావం తగ్గించడానికి ప్రయత్నించాలని టిడిపి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం హైదరాబాద్ నగరంలో ఐటి రంగంలో ఆయన సాధించిన ప్రగతిని ఎవరూ కాదనలేరని, ఇదే తరహా అభివృద్ధి సీమాంధ్రలో సాధ్యం కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలనే నినాదంతో ఈసారి సీమాంధ్రలో ప్రచారం సాగిస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు.

సంక్షోభ సమయంలో బలమైన నాయకత్వం కావాలి, ఒక పార్టీ నేత జైలులో ఉన్నాడు, ఇక రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరం అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి రాజధాని ఏర్పాటు చేయడం సాధ్యం అనే ప్రచారం బలంగా జనంలోకి వెళితే టిడిపికి ప్రయోజన కరంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్రలో అభివృద్ధి సాధ్యం అని తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.

దేశంలో నరేంద్ర మోడీతో పోటీ పడి అభివృద్ధి సాధించేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్క చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు, ఇలాంటి పరిస్థితిలో సీమాంధ్రకు బాబు నాయకత్వం అవసరం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా, కొత్త రాజధాని నిర్మాణంపై ఇప్పటి నుంచే దృష్టి సారించక తప్పదని అందుకే చంద్రబాబు నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటారని ఆయన తెలిపారు. 50 ఏళ్లలో హైదరాబాద్‌లో సాధించిన ప్రగతి సీమాంధ్రలో బాబు ఐదేళ్లలో సాధించి చూపిస్తారని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు.