October 21, 2012

బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్‌కు భాగస్వామ్యం నేను వెళ్లాక చర్చించండి వాస్తవమైతే నాతో కలిసిరండి 20వ రోజు యాత్రలో చంద్రబాబు

రేషన్ బియ్యం రద్దు!
కేంద్రం నగదు బదిలీ ఉద్దేశమిదే
పేదలకు మరింత భారం తప్పదు
అకౌంట్లో డబ్బులు వేసి బియ్యం నిలిపేస్తారు
దీనిని మేం ప్రతిఘటిస్తాం.. మీరు అడ్డుకోండి
ప్రజలకు చంద్రబాబు పిలుపు

ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు
బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్‌కు భాగస్వామ్యం
నేను వెళ్లాక చర్చించండి
వాస్తవమైతే నాతో కలిసిరండి
  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఆ పథకం అమల్లోకి వస్తే సబ్సిడీ బియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయనుందని హెచ్చరించారు. ఈ పథకం కారణంగా పేదలపై మరింత భారం పడి వారి జీవన ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

"రాష్ట్రంలో ప్రజలకు అందే సబ్సిడీ రేషన్ బియ్యాన్ని కాంగ్రెస్ పాలకులు రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు.. పేదలంతా బ్యాంకుల్లో అకౌంట్లు తెరిస్తే, బియ్యానికి ఇచ్చే సబ్సిడీని అందులో జమ చేస్తారు. అంటే, కుటుంబానికి ఇచ్చే 20 కిలోల బియ్యంపై కిలోకు రూ.5 వంతున రూ.100 ఆ కుటుంబ యజమాని అకౌంట్లో వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. తద్వారా, సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేసే విధంగా ఆ పథకం ఉంది. ఈ విధానాన్ని మేం ప్రతిఘటిస్తాం. పాలకుల కుట్రలను గ్రహించి మీరు కూడా అడ్డుకోండి'' అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పాదయాత్ర 20వ రోజైన ఆదివారం ఆయన కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్ నుంచి నడక సాగించారు.

గూడూరు గ్రామంలో ముస్లిం నేతలు ఎన్ఎండీ ఫరూక్, అల్లా బక్ష్ తదితరులు ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు 15 సీట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. చట్టసభల్లో 8 శాతం రిజర్వేషన్‌తోపాటు రూ.2,500 కోట్లు ముస్లింల అభివృద్ధికి కేటాయించి చరిత్ర సృష్టిస్తానని వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల సంక్షేమ పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. మత సామరస్యానికి టీడీపీ కంటే కృషి చేసిన పార్టీలు ఏవీ లేవన్నారు. గోధ్రా ఘటనలో నరేంద్ర మోడీపై విమర్శలు వచ్చిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని ఉంటే ముస్లింల మదిలో తాను చిరస్థాయిగా నిలిచిపోయే వాడినని చెప్పారు. ఆ విషయంలో తాను తప్పు చేశానని ముస్లింల ముందు ఒప్పుకొన్నారు. బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందని విమర్శించారు.

నేను వెళ్లిన తర్వాత చర్చించండి.. వాస్తవమైతే నాతో రండి
"నాకు ఏ కోరికలు, ఆశలు లేవు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చూశాను. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాను. మీ రుణం తీర్చుకోవాలని మీ ముందుకు వచ్చాను. కాంగ్రెస్ పాలకులు చేస్తున్న దోపిడీని వివరించి మిమ్మల్ని ఆలోచింప చేయడానికి పాదయాత్ర ప్రారంభించాను. నేను చెప్పిన విషయాలన్నీ విన్న మీరు నేను వెళ్లిన తర్వాత వాటిపై చర్చించండి. నేను చెప్పిన అంశాల్లో వాస్తవాలుంటే నాతో కలిసి రండి. ధర్మపోరాటం చేస్తున్న నాకు మద్దతు పలకండి. అవినీతి రహిత పాలనతోనే మీ కష్టాలు తీరతాయి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని, లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న నేత 5 లక్షల కోట్ల సంపాదనే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలని తాను 63 ఏళ్ల వయసులో కాళ్లు నొప్పి వస్తున్నా నడక సాగిస్తున్నానని వివరించారు.

టీడీపీ నగదు బదిలీ వేరు
తాను ప్రతిపాదించిన నగదు బదిలీ పథకానికి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకానికి చాలా తేడా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ప్రతిపాదించిన నగదు బదిలీ పథకంలో ఇప్పటికే ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తీసివేయాలని అనుకోలేదని, వాటిని అలాగే ఉంచి, వాటికి అదనంగా మాత్రమే డబ్బులు ఇద్దామని అనుకున్నామని వివరించారు.

పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. "ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి పై స్థాయిలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం ద్వారా కొంత ధనం ఆదా చేసి దానిని ప్రజలకు ఇవ్వాలనేది నా ఆలోచన. బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనే తప్పు. డబ్బులు ఇస్తే నేరుగా బ్రాందీ షాపులకు చేరతాయి. బియ్యం ఇస్తే నేరుగా ఇంటికి చేరతాయి.

అందువల్ల, పేదలకు ప్రయోజనం కల్పించే ఏ పథకంలోనూ మార్పులు చేయకుండా నగదు బదిలీ అమలు చేస్తాం. రైతులకు ఎరువులపై సబ్సిడీ తీసేసి, ఆ డబ్బులను బ్యాంకు అకౌంట్లో వేస్తామనేది కూడా తప్పుడు ఆలోచన'' అని వివరించారు. సబ్సిడీ భారం నుంచి తప్పించుకుని ఖర్చు తగ్గించుకునే పద్ధతిలోనే వాళ్లు ఆలోచిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. తాము మాత్రం ప్రజలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాతే అదనపు ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు.
No comments :

No comments :