October 21, 2012

బాబు యాత్రతో కొన్నిపనులు అవుతున్నాయ్! ప్రజాభిప్రాయంలో ఆసక్తికర విషయాలు 22.10.2012

బాబు యాత్రతో కొన్నిపనులు అవుతున్నాయ్!
ప్రజాభిప్రాయంలో ఆసక్తికర విషయాలు

  టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర గురించి ప్రజలేమనుకుంటున్నారు?... ఆయన చెప్తున్న విషయాలపై వారి స్పందన ఎలా ఉంది?...ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర మార్గంలో కొందరిని పలకరించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. పాదయాత్ర మార్గంలోని జూలకల్లు, పొన్నేకల్లు, గూడూరు గ్రామాల్లో ప్రజలను పలకరించినప్పుడు ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రాజు, రైతు(కోడుమూరు): చంద్రబాబు వచ్చినందుకు మాకిక్కడ కొన్ని పనులు అవుతున్నాయి. ఆయన వస్తున్నాడని తెలియగానే తుంగభద్ర ప్రాజెక్టు కోడుమూరు కాలువకు ఒకటన్నర దినం నీళ్లొదిలారు. ఆయన ఎమ్మిగనూరు దాటగానే నీళ్లు ఆగిపోయాయి. రెండు, మూడేళ్ల నుంచి నీరు వదలడం లేదు. ఇప్పుడెట్లా వదిలారు?. కౌలు రైతులకు కరువు నష్టపరిహారం ఇవ్వకుండా అనేక నెలల నుంచి తిప్పించుకుంటున్నారు.

చంద్రబాబు వచ్చి తిడతారని భయపడి ఇప్పటికిప్పుడు కొన్ని ఇస్తున్నారు. ఆయన వచ్చినందుకు మాకు మంచే జరిగింది. కోడుమూరు కాలువకు 10 రోజులు నీరిస్తే ఈ పంట బయటపడుతుంది. ప్రేమ్‌రాజు, బీఫార్మసీ విద్యార్థి(జూలకల్లు): చంద్రబాబు చెప్తున్న విషయాలు బాగానే ఉన్నాయి. జగన్ అవినీతి గురించి ఇప్పుడు బాబు చెప్పారు. రేపు ఆ పార్టీ వాళ్లు వాళ్లది చెప్తారు. ఎవరి వాదన వింటే వారిదే కరెక్ట్ అనిపిస్తోంది.

మాదమ్మ, వృద్ధురాలు(జూలకల్లు): చంద్రబాబు తండ్రి లెక్కన చానా వివరంగా చెప్పాడు. మకొచ్చేవన్నీ ఎలా తినేస్తున్నారో? బాగా చెప్పాడు. మాకొచ్చే పింఛన్లో రూ.150 ఇచ్చి మిగిలినవి నొక్కేస్తున్నారు. చంద్రబాబు ఈ సారి రూ.600 చేస్తామంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరే జనాలకు చేశారు. నేను జగన్‌ను చూడలేదు. మావాళ్లల్లో చంద్రబాబు మాటే వినిపిస్తోంది.

వెంకమ్మ, వృద్ధురాలు (పొన్నేకల్లు): చంద్రబాబు నడుస్తా వస్తున్నాడంటే చూద్దామని వచ్చాను. అయ్య కష్టపడి నడుస్తున్నారు. అందుకే వచ్చా. బ్యాంకు లోన్లు మాఫీ చేయిస్తాడని మా ఊళ్లో అనుకుంటున్నారు.

నూర్జాహాన్, పొన్నేకల్లు: చంద్రబాబు మంచిగా మాట్లాడాడు. మా ఊళ్లో కరువుతో చచ్చిపోతున్నాం. నీళ్లు లేవు. పంటలకు రేట్లు లేవు. చంద్రబాబు అయ్యే మాట్లాడారు. చెప్పినవన్నీ చేస్తే ఆయన చాల గొప్పోడు అవుతాడు. ఈ సారి ఆయనకు మద్దతిస్తే ఎట్లా ఉంటుందా? అనుకుంటున్నాం.

పెదగొల్ల ఎల్లప్ప, రైతు(గూడూరు): చంద్రబాబు తాను చేసిన తప్పులను తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. రైతులకు ఈ సారి బాగా చేస్తానని చానా సేపు చెపుతున్నాడు. పంట పరిహారం రైతులకు అందడం లేదు. తినేస్తున్నారు. దాని గురించి కూడా చెప్పాడు.

షబ్బీర్, గూడూరు: కొన్ని రోజుల క్రితం వరకు మా ఊళ్లో జగన్ పార్టీ గాలి ఉండేది. ఆయన జైలుకు వెళ్లి రాకపోయేసరికి ఆ పార్టీ తగ్గింది. టీడీపీ మాట పెరుగుతోంది. రామారావు చేసిన పనులు ఆ పార్టీకి మంచిపేరు తెచ్చాయి. బాబు ఏమి చెప్తాడో విందామని ఇవాళ పనికి పోకుండా వచ్చా. ఆయన కోసం నిలబడి ఉన్నా.

గణేశ్, మాధవ్ (విద్యార్థులు-గూడూరు): చంద్రబాబు ఉపన్యాసం విన్నాం. ఆయన ఎవరెవరికీ ఏమేమిచేస్తాడో బాగా చెప్తూ ఉన్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం వల్ల ఈ సారి ఓటు ఆయనకేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. మేము పోయిన సారి కాంగ్రెస్‌కు వేశాం. పాదయాత్ర వల్ల చంద్రబాబు పార్టీ బలం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. జగన్ పార్టీ బలం మా ఊళ్లో తగ్గింది. జగన్ జైలు నుంచి రాకపోయేసరికి ఈ మధ్య మా ఊళ్లో కొంత మంది మళ్లీ ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.
No comments :

No comments :