March 15, 2013

మా గెలుపు చారిత్రక అవసరం

ఏలూరు:  టీడీపీ గెలుపు చారిత్రక అవసరం. ఇప్పడున్న దుర్మార్గ పాలన అంతరించాలన్నా, ప్రజల కష్టాలు తొలగాలన్నా, సక్రమంగా కరెంటు సరఫరా జరగాలన్నా, ప్రపంచ పటంలో అవినీతి రహిత ర్రాష్టంగా తీర్చిదిద్దాలన్నా తెలుగుదేశం గెలుపు ఒక చారిత్రక అవసరం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకే ఇప్పటి నుంచే తక్షణం కార్యరంగంలోకి దిగాలని, ప్రతీ ఇంటి నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అవినీతిపై నేనొక్కడినే పోరాడితేకాదు, అసమర్ధ ప్రభుత్వాలను, దద్దమ్మ నేతలను తరిమివేయాలన్నా మీరంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ర్రాష్టంలో ఇప్పుడు మిగిలింది అవినీతే అన్నారు. నేను చేస్తున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీ పాదయాత్రగానే భావిస్తే రాబోయే రోజుల్లో ర్రాష్ట భవిష్యత్ సర్వనాశనం అవుతుందని, దీనిని గమనించి తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన 164 రోజైన గురువారం ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం గురించి, పిల్ల కాంగ్రెస్ ఎత్తుగడల గురించి, స్థానిక సమస్యల గురించి ఆయన అన్నిచోట్లా ప్రస్తావించారు. తాను చేస్తున్న పాదయాత్ర లోకకల్యాణ యాత్రగా ప్రకటించారు. 'ఇప్పుడున్నది దద్దమ్మల ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం. కరెంటు కష్టాలు తీర్చండి అంటే ఛార్జీలు పెంచుతారు. వీళ్లకు కావల్సిందల్లా సూట్‌కేసు రాజకీయాలే' అని కాంగ్రెస్‌తో పాటు మిగతా పక్షాలపై తెలుగుదేశం అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారుగానీ, ఇప్పుడు జగన్ బెయిల్ కోసం అవిశ్వాసం పేరిట చీకటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

కవిటం వద్ద నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలోను, ఆ తర్వాత మార్టేరు, పెనుగొండల వద్ద జరిగిన బహిరంగసభల్లోనూ ఆయన కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లపై వాగ్బాణాలు సంధించారు. స్థానిక సమస్యలను ప్రస్తావించారు. వస్త్రవ్యాపారులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ర్రాష్టంలో పాలన గాడి తప్పిందని, దీనిని ఒక గాటన పెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నానని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అప్పు లేని రైతును తాను చూడాలనుకుంటున్నానని తన మనసులోని మాట చెప్పారు. వైఎస్, కిరణ్ పరిపాలనలో దోపిడీయే జరిగిందని, రౌడీలు పెరిగారని ఆరోపించారు. ఎక్కడైనా ఒక తండ్రి తాను దోపిడీలు చేయడమే కాకుండా కొడుకును కూడా దోపిడీ చేయమని ప్రోత్సహించి జైలుకు పంపడం చూశామా, అది వైఎస్‌కే చెల్లిందని తూర్పురబట్టారు. వైఎస్ కుటుంబం చేయాల్సిందంతా చేసి, దోపిడీ చేసి జైలులో కూడా ఆనందంగానే గడుపుతోందని పరిహసించారు.

మాఫియా తయారు చేసేవాళ్ల వెంట వెళ్లాలని ఎవరైనా భావిస్తే అది భవిష్యత్ తరాలు నాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కడతామని కాలువలు తవ్వి దోపిడీలు చేశారని, రెండో పంటకు నీరివ్వకుండాపోయారని తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైఎస్ తన హయాంలో ఎవడబ్బ సొమ్మని, ర్రాష్టాన్ని దోచుకుతిన్నారని, దీనిని గమనించాలన్నారు. వైఎస్ హయాంలో పేదలకుగానీ, ఎస్సీ, ఎస్టీలకుగానీ, రైతులకుగానీ ఏమి ఒరిగిందని ప్రశ్నించారు. కనీసం రైతులకు పంట నష్టం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం ర్రాష్టంలో ఉందన్నారు. 'తమ్ముళ్లు మోటార్‌సైకిళ్లను కాదు.. సైకిళ్లను నమ్ముకోండి' అంటూ యువకులకు పిలుపునిచ్చారు.

అధికారంలోకి వస్తే రైతులకు తొమ్మిది గంటల పాటు కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇస్తూ మాలలకు తమ పార్టీ వ్యతిరేకం కాదని అన్నిచోట్లా స్ప ష్టం చేశారు. చిల్లరకొట్టులను దివాళా తీసేలా కొత్త విధానాలను తెరముందుకు తెస్తున్నారని, ఇదే జరిగితే లక్షలాది మంది చిన్న వ్యాపారుల బతుకు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాట్‌కు వ్యతిరేకంగా వ్యాపారులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారని, వారిపక్షాన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.