March 15, 2013

సర్కారు లెక్కల్లో లేని 'కౌలు'సాయం

పల్లెకు వెళితే పాడిపంటలు పొంగిపొర్లాలి. పైరగాలి పలకరించాలి. గుడిలో గణగణ వినిపించాలి. బడి పిల్లల గొంతులు గలగలమనాలి. కానీ ఎక్కడ? ఇప్పటికి వేల కిలోమీటర్లు నడిచాను. కొన్ని వందల గ్రామాలు తిరిగాను. గుడి, బడి ఎక్కడైనా కనిపిస్తాయేమోనని చూశాను. చాలా చోట్ల అసలే లేవు. ఉన్న దగ్గరైనా కూనరిల్లుతున్నాయి. అదే సమయంలో ఏ పల్లెలో చూసినా బీర్లు, చీప్ లిక్కర్లు పొంగిపొర్లుతున్నాయి. అడుగుపెట్టగానే మత్తు గాలులు పలకరిస్తున్నాయి.

ఎక్కడ చూసినా గ్లాసుల గలగలలే. తూగే మనుషుల గొంతుల్లో గురగుర..ఇరగవరంలో అడుగుపెట్టగానే కంటబడ్డ దృశ్యాలివి. పేదోడి బతుకు బెల్టుషాపులకు అమ్ముడుపోవడం దారుణం! వేల్పూరులో కలిసిన ఆ ఆడపడుచులూ ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. "కూలికి వెళ్లినా కూటికి రావడం లేదు సార్! వచ్చేదే పదీపరక. కుడి చేత్తో ఇలా కూలి తీసుకోగానే పెనిమిటి ఎడమ చేత్లో లాగేసుకొని బెల్టు షాపు దారి పడుతున్నాడు. ఈ మాయదారి బెల్టు షాపులకు దూము తగల! కాల్చుకు తింటున్నాయి'' అని అంటున్నప్పుడు ఆ కళ్లలో ఎర్రజీర గమనించాను. వీళ్లకిక ఎవరి భరోసా అక్కర్లేదు!

చేసిన కష్టాన్ని కంటితో చూసుకోవడమే గానీ అనుభవించలేని బతుకు కౌలురైతుది. తుఫాను వచ్చినా, వరద వచ్చిన రైతుతో సమానంతో నష్టపోతాడు. కానీ, సాయం వరకు వచ్చేసరికి సర్కారు లెక్కల్లోనే ఉండరు. "వరదొస్తే అందే సాయమే
అరకొర. అదీ భూమి యజమానికే పోతుంద''ని వేల్పూరులో ఆ కౌలు రైతు వాపోయాడు. కౌలుకు 'క్రెడిటా?' అంటూ నోరు వెళ్లబెట్టాడు. బ్యాంకుల గడప ఎక్కడమే గగనంగా ఉన్నదని కళ్లు వత్తుకున్నాడు. ఎవరైనా వీరికి రుణపడాల్సిందే!