March 15, 2013

రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైయస్ : మోత్కుపల్లి

జాతీయ భావాలతో పుట్టిన పార్టీ టీడీపీ
కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం
బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ అండ

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రాంతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది, పోరాటం చేస్తున్నది టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీయేనని మోత్కుపల్లి తెలిపారు.

శుక్రవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోత్కుపల్లి సభలో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని విమర్శించడం సరికాదని మోత్కుపల్లి అన్నారు. గతంలో ప్రభుత్వాన్ని పడగొడితే మద్దతిస్తామని, తమకు ఎక్కువ మంది సభ్యుల మద్దతుందని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అప్పుడు ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు అవిశ్వాసం పెడితే జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదన్నారు. ఇప్పుడు వారి స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాసం పెట్టారన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తమ పార్టీ అధినేత జైలులో లేరని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. వాళ్ల కోసం మేము అవిశ్వాసం పెట్టాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీని ఈ దేశంలో స్థానిక పార్టీ దశకు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేందుకు వైయస్ విజయమ్మ పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. అమాయకురాలిని సభకు తీసుకు వచ్చి బాధపెడుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తోంది టిడిపియే అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష కోట్లు సంపాదించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. సామాజిక గొంతు వినిపించింది టిడిపియే అన్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కయిందనడం బుద్ధిలేని రాజకీయం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెసు పార్టీలో కలవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే జగన్ పార్టీ పెట్టారన్నారు. ఆ పార్టీ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక విధానాల పునాదులతో టిడిపి పుట్టిందన్నారు. ఓఎంసిలో కాపు రామచంద్రా రెడ్డి వాటా దారుడు అన్నారు. ఆయన త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు. తాను మాట్లాడుతుండగా.. నిలబడ్డ వారిని సూచిస్తూ వారిలో వంద కోట్లకు తక్కువ ఉన్న వారెవరు లేరని మోత్కుపల్లి అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలు తోడు దొంగలేనని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జైలులో ఉండేవాడన్నారు. సిబిఐ విచారణలో వారు దొంగలని తేలిందన్నారు. జగన్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. రూ. 43వేల కోట్లు దోచుకున్నారని సిబిఐ చెప్పిందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవసరమైన వాటి కోసం త్యాగాలు చేయాలే తప్ప సొంత రాజకీయాల కోసం కాదన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఏ ఒక్కటి సొంతగా చెప్పలేదన్నారు. దోపిడీ చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటన్నారు. సిబిఐ ఛార్జీషీటులోనే వారి గురించి ఉందన్నారు.