March 15, 2013

బాటసారికి నీరాజనం

ఏలూరు : జిల్లాలో ఆరు రోజులు సుదీర్ఘపాదయాత్ర...ఉదయం సమీక్షలు, మధ్యాహ్నం నడక. పొద్దుపోయినా, అర్ధరాత్రి అయినా, మంచుకురుస్తున్నా, కాళ్లు నొప్పిపెడుతున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు బహుదూర బాటసారిలా సాగుతూనే ఉన్నారు. జనం మధ్యన పున్నమి చంద్రుడై వారి అభిమానాన్ని మూటగట్టుకోవడానికి, తెలుగుదేశంకు కొత్త ఊపు తెచ్చేందుకు,అధికారానికి చేరువయ్యేలా ఆయన శారీరక కష్టాన్ని కూడా ఖాతరు చేయకుండా పాదయాత్ర సాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున కవిటం రాత్రి బసకు చేరుకున్న ఆయన గురువారం మధ్యాహ్నం నరసాపురం, పాలకొల్లు కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో రెండింటిలోనూ కార్యకర్తలు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

డాక్టర్ బాబ్జి, చినమిల్లి సత్యనారాయణను క్యారెక్టర్ ఉన్న పెద్ద మనుషులుగా అభివర్ణించారు. తానే వారిని ఎమ్మెల్యేల కింద స్వయంగా బరిలోకి దింపానని చెప్పుకొచ్చారు. పార్టీని గెలిపించుకోవడానికి ఇక రాగద్వేషాలకు అతీతంగా ముందుకు సాగాలని, పార్టీకి విజయం సమకూర్చాల్సిందిగా కోరారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరాదని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు స్వాగతించారు. 'మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా మద్దతిస్తున్నాం' అని ప్రకటించడం ద్వారా చంద్రబాబులోను నూతనోత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఆయన పాదయాత్రకు దిగారు. జగన్నాథపురం, మార్టేరుల మధ్య వందలాది మంది ఆయన యాత్రలో జతకలిశారు.

మార్టేరు సెంటర్‌లో జరిగిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక్కడ కూడా ఆయన ప్రధాన సమస్య అయిన కరెంటు కోతలనే ప్రస్తావించడం ద్వారా అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. గురువారం కరెంటు ఛార్జీలు పెరిగిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఇప్పుడే అయిపోలేదు, మీ నడ్డి విరిచేందుకు మరో పద మూడు వేల కోట్లు ఛార్జీలు భారం వేయడానికి కిరికిరి సీఎం సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. బీహార్ కంటే ర్రాష్ట పరిస్థితి అధ్వానం గా మారిందని, అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. పెనుగొండలో జరిగిన సభకు కూడా పెద్దసంఖ్యలోనే ప్రజలు హాజరయ్యారు. మార్గమధ్యలో అనేకచోట్ల కొందరు హారతులు పట్టారు. చాయ్ తాగుతూ.. కొబ్బరినీళ్లతో సేదతీరుతూ ముందుకు సాగారు. మార్టేరులో ఓ కార్యకర్త 'సార్.. మా సెంటర్‌లో కోడిపకోడి అదుర్స్, ఓ ముక్క రుచిచూడండి' అంటూ ఆఫర్ చేశారు.

దీనిపైనా చంద్రబాబు ప్రతిస్పందించారు. పెనుగొండ సెంటర్‌లో ప్రవేశించినప్పుడు వాసవీ మాతను గుర్తు చేసుకున్నారు. వాసవీ మాత పుట్టిన ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దోపిడీదారుడు వై.ఎస్ విగ్రహాలు పెట్టడం న్యాయమేనా అని స్థానికులను ప్రశ్నించారు. తద్వారా పుణ్యక్షేత్ర ప్రసిద్ధిని ఒకవైపు వివరిస్తూనే, ఇంకోవైపు వాసవీ మాత కొలువుదీరిన ఇలా ంటి కేంద్రంలో అవినీతిపరులకు చోటివ్వవద్దంటూ పిలుపునిచ్చినప్పుడు కూడా ప్రజలకు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గడచిన ఐదురోజులతో పోలిస్తే ఆరో రోజైన గురువారం ఆయన పాదయాత్ర ఒకింత వేగంగానే ముందుకు సాగింది. మార్గమధ్యలో ఆయన పార్టీ నేతలతో ఎక్కువగా సంభాషించారు.

నియోజకవర్గ స్థితిగతులు, తాజా రాజకీయాలపైన ఆయన జిల్లా నేతలతో ముచ్చటిస్తూ అడుగులు వేశారు. చంద్రబాబు వెంట పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పీతల సుజాత, అంగర రామ్మోహన్, మాగంటి బాబు,గుబ్బల తమ్మయ్య, గన్ని వీరాంజనేయులు, పాందువ శ్రీను, పాలి ప్రసాద్, ఉ ప్పాల జగదీష్‌బాబు, గాదిరాజు బాబు, మొ డియం శ్రీనివాసరావు, దాలయ్య, బూరుగుపల్లి వేణుగోపాల్, మేఘలాదేవి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ,అంబికా కృష్ణ, ముళ్లపూడి బాపిరాజు,శీలం వెంకటేశ్వరరావు, వై టిరాజా,శివరామరాజు తదితరులు ఉన్నారు.