March 15, 2013

బాబు టూర్ ఖరారు

 కాకినాడ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో 13 రోజులు కొనసాగనుంది. ఈ మేరకు టీడీపీ నేతలు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర రూట్ మేప్‌ను సిద్ధం చేశారు. జిల్లాలో చంద్రబాబు రాజమండ్రి నుంచి తుని వరకు 195 కిలోమీటర్ల మేర నడవనున్నారు. ఈ యాత్ర 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామాల మీదుగా సాగనుంది.

ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్‌కమ్ రైలు బ్రిడ్జి మీదుగా రాజమండ్రి చేరుకుంటారు. ఆ రాత్రి రాజమండ్రిలో బసచేస్తారు. ఆ మరుసటి రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అనపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు.

అనపర్తి నుంచి మండపేట, రాయవరం, గొల్లల మామిడాడ, పెదపూడి, పెద్దాడల మీదుగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పాదయాత్ర సాగుతుంది.అక్కడ నుంచి కాకినాడ నగరం మీదుగా పిఠాపురం, కత్తిపూడి, అన్నవరం మీదుగా తుని వరకు బాబు పాదయాత్ర చేయడానికి టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాల మీదుగా..

జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో 80 గ్రామాలను కవర్ చేస్తూ యాత్ర సాగుతుంది. రోజూ 15 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేసేలా టీడీపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మార్చి 21న జిల్లాకు వచ్చి.. 13 రోజులపాటు 195 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి.. ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల మధ్యలో విశాఖ జిల్లా పాయకరావుపేట చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

థర్మల్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన

అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బాలవరం, బలభద్రపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్న 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో 'మీకోసం వస్తున్నా' పాదయాత్రను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రలో పోలీస్ లాఠీచార్జిలో గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించే అవకాశం ఉంది. థర్మల్ పోరాటంలో కేసులు ఎదుర్కొంటున్న నేతలతోనూ చంద్రబాబు కొంతసేపు చర్చించేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడే

మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జిల్లాలో చంద్రబాబు సమక్షంలో జరిపేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 29వ తేదీ నాటికి చంద్రబాబు యాత్ర జిల్లాలో 9 రోజులకు చేరుకుంటుంది. ఆ సమయానికి పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంటుంది. అక్కడే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం

పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రతో జిల్లాలో టీడీపీ గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పాదయాత్ర ప్రభావం ఉంటుందని వారం తా భావిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో జిల్లాలో కరెంటుకోత, తాగు, సాగునీరు తదితర సమస్యలపై ఎక్కువగా ప్రస్తావించి జనంలోకి వెళ్లాలని టీడీపీ యోచిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖతను తమ కు అనుకూలంగా మలచుకునేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్న టీడీపీ నేతలు 'వస్తున్నా మీ కోసం' యాత్రను విజయమవంతం చేయడానికి ఇప్పటి నుంచీ కార్యరంగంలోకి దిగుతున్నారు.