March 15, 2013

ఏప్రిల్‌లో బాబు యాత్ర


విశాఖపట్నం:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏప్రిల్ మొదటి వారంలో జిల్లాలో అడుగుపెట్టను న్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం మీకోసం పాదయాత్ర ఏప్రిల్ నాల్గవ తేదీతో తూర్పుగోదావరి జిల్లాలో ముగుస్తుంది. ఐదో తేదీన పాయకరావుపేటలో చంద్రబాబు అడుగుపెడతారని అంచనా వేస్తున్నారు. కచ్చితమైన తేదీ చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగింపుపై ఆధారపడి వుంటుందంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న చంద్రబాబు ఈనెల 20వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. అక్కడ నుంచి 15 రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఆ జిల్లాలో మీకోసం పాదయాత్ర ముగింపు తర్వాత చంద్రబాబు తుని నుంచి పాయకరావుపేటలో ప్రవేశిస్తారు. ఈలోగా పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఖరారుకాని షెడ్యూల్

జిల్లాలో చంద్రబాబు మీకోసం పాదయాత్రకు సంబంధించి రూటు ఇంకా ఖరారుకాలేదు. జిల్లాలో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు అధినేత పాదయాత్ర వుంటుందని కేంద్ర కార్యాలయం నుంచి సూచనప్రాయంగా సమాచారం అందింది. రూరల్‌తోపాటు నగరంలో కూడా చంద్రబాబు పర్యటన వుంటుందని తెలిసింది. పాయకరావుపేట నుంచి ఎలమంచిలి, అనకాపల్లి మీదుగా నగరంలోకి వస్తారా? లేక ఎలమంచిలి నుంచి అచ్యుతాపురం, పరవాడ మీదుగా నగరంలోకి అడుగుపెడతారా? అన్నది రూరల్ జిల్లా నేతలు ఖరారు చేయాల్సి వుంది. దాని ప్రకారం నగరంలో రూటు నిర్ణయిస్తామని అర్బన్ జిల్లా నాయకులు కేంద్ర కార్యాలయానికి నివేదించారు. నగరం నుంచి ఆనందపురం మీదుగా విజయనగరం వెళతారా? లేదా పెందుర్తి, కొత్తవలస, వేపాడ మీదుగా వెళతారా? అన్నది ఇంకా ఖరారుచేయలేదు. గతంలో వున్న ఆదేశాల మేరకు జిల్లాలో చంద్రబాబు మీకోసం పాదయాత్ర ఇప్పటికే ఖరారుకావలసి వుంది. అయితే జిల్లా పార్టీలో నెలకొన్న సంక్షోభం కారణంగా జాప్యం జరుగుతోంది. అయ్యన్నపాత్రుడు వివాదం ముగిసిన వెంటనే దాడి వీరభద్రరావు వ్యవహారం తలెత్తడంతో కొంతమేర ప్రభావం చూపింది. రూరల్ జిల్లాలో పాదయాత్ర ఖరారు బాధ్యత రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌పై వుంది. జిల్లాలో ముఖ్య నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, శాసనసభ్యులు సమావేశమై పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయాల్సి వుంది.