March 15, 2013

-సీఎం పదవి ఆవ్వనందునే జగన్ పార్టీ పెట్టాడు

దుర్మార్గులు.. తోడు దొంగలు!
-వైఎస్‌పై, వైసీపీ, కాంగ్రెస్ నేతలపై మోత్కుపల్లి ఫైర్
-రాష్ట్ర నాశనానికి వైఎస్సే కారణం
-వైఎస్‌కు బలి పశువుగా మారిన శ్రీలక్ష్మి

హైదరాబాద్: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా 'దుర్మార్గులు.. తోడు దొంగలు' అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చెలరేగిపోయారు. "రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైఎస్ కాదా? సీఎం పదవి ఇవ్వనందునే జగన్ పార్టీ పెట్టడం వాస్తవం కాదా?'' అని ప్రశ్నించారు. 'ఈ దుర్మార్గులు.. దోపిడీదారులు' అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవిశ్వాసంపై చర్చ జరపకుండా తమను దుర్మార్గులంటూ వ్యాఖ్యానించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో.. 'వీళ్లలో రూ.100 కోట్లకు తక్కువ సంపాదించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? ప్రజల సొమ్ము దోపిడీ చేసిన ఈ 'దుర్మార్గులు' పెట్టిన అవిశ్వాసానికి మేం మద్దతు ఇవ్వాలా?' అని ధ్వజమెత్తారు. "సీబీఐ విచారణలో మీరు దొంగలని తేలింది.

అందుకే జైల్లో పెట్టారు. మమ్మల్ని ఎలా తప్పుపడతారు. వైఎస్ బతికి ఉంటే ఇప్పటికి జైల్లో ఉండేవాడు. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు ఉండబట్టే మాట్లాడుతున్నాం. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టినందుకే అప్పట్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. లోటస్‌పాండ్‌లో భవన నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీబీఐ దర్యాప్తు నివేదికను చదివితే వీరికెందుకు కడుపు మంట? రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలకు కారణం వైఎస్సే. ఒకడు సంపదను సంపాదించుకుని ఏమి తీసుకుపోయాడు (బైబిల్‌ను ఉటంకిస్తూ)? రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్లు నిలువు దోపిడీ చేశారు.

విజయమ్మకు కడుపు కోత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కొడుకుని బయటకు తెచ్చుకోవాలని, కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇతరులు రాసిచ్చిన ప్రసంగ పాఠం చదివేందుకు విజయలక్ష్మి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోంది. అమాయకురాలిని సభకు తీసుకొచ్చి బాధ పెడుతున్నారు. మా సోదరి శ్రీలక్ష్మి వైఎస్ బలిపశువుగా మారింది. ఆమె ఈ స్థితిలో ఉండడానికి వైఎస్సే కారణం. వైఎస్ దుర్మార్గుడు'' అన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తమ పార్టీ అధినేత జైల్లో లేరని ఎద్దేవా చేశారు. ఓబుళాపురం మైనింగ్‌లో కాపు రామచంద్రారెడ్డి వాటాదారుడని, ఆయనా జైలుకు వెళ్లే జాబితాలో ఉన్నారని చెప్పారు.