March 28, 2013

జలయజ్ఞం పేరుతో కోట్లు తిన్నా ఒక్క ప్రాజెక్టూ కట్టని కాంగ్రెస్ నేతలు

బ్రిటిషోడే నయం!
డబ్బు, బంగారం తీసుకెళ్లినా
ఆనకట్టలైనా కట్టాడు
'తూర్పు' యాత్రలో చంద్రబాబు



ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు సాగించిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు. కిరణ్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని ఆక్షేపించారు. వైఎస్, కాంగ్రెస్ చేసిన తప్పులకు జనం శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ దొంగల్ని ప్రజాకోర్టులో నిలదీయాలని పిలుపునిచ్చారు. అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్‌ను గద్దె దించాలని కొమరిపాలెం సభలో ఒక కార్యకర్త కోరగా..ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి టీడీపీకి లేదని వివరించారు. విద్యుత్ సమస్య నుంచి ఉపాధి సమస్య దాకా.. దేన్నీ పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మండిపడ్డారు.

"మేం అధికారంలో ఉన్నపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ రాష్ట్రానికి వచ్చారు. ఐటీలో హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవాలని కితాబు ఇచ్చారు. ఇపుడసలు హైదరాబాద్ వెళ్లొద్దని ఆ దేశ ప్రభుత్వం తన ప్రజలను హెచ్చరిస్తోంది'' అని పేర్కొన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తానన్న వైఎస్..వారిని భిక్షాధికారులను చేశారని చెప్పారు.

అలాంటి మోసపు మాటలతోనే ఆయన కుమారుడు గద్దెనెక్కాలని చూస్తున్నాడన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీస్తున్న 'కేపీఆర్ థర్మల్ ప్లాంట్' నిర్మాణంపై తమ పార్టీ అసెంబ్లీలో చర్చిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్రాజెక్టులను గ్రామాల మధ్య పెట్టడాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్లాంట్ ప్రాంతంలోని గ్రామాల ప్రజలను ఆయన కలుసుకున్నారు.
కాకినాడ : "బ్రిటిష్ పాలకుల కంటే కాంగ్రెస్ దొంగలే ప్రమాదకరం. తెల్లదొరలు మన దేశం నుంచి డబ్బు, బంగారం దోచుకుపోయారు. వీళ్లు వాటితోపాటు గనులు, రైతుల భూములూ దోచేస్తున్నారు. వాళ్లు ఆనకట్టలైనా కట్టారు. వీళ్లు జలయజ్ఞం పేరుతో తొమ్మిదేళ్లలో రూ.80 వేల కోట్లు తిన్నారు. ఐనా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రయోగాలకు పోయి జైలు పార్టీని అధికారంలోకి తీసుకురావద్దని ప్రజలకు హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం, బిక్కవోలు మండలాల్లో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.