March 28, 2013

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక దీక్ష


గుంటూరు : విద్యుత్ సంక్షోభాన్ని ప్రభు త్వం పరిష్కరించేంత వరకు తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పరిష్కారం కోసం హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకొన్నది. దీక్షలో పుల్లారావుతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీవీఎస్ ఆంజనేయులు నీరసించిపోయారు. వారి శరీర చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఇటీవలే పచ్చకామెర్లకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకముందే దీక్షలో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్లు సహచర ఎమ్మెల్యేలు తెలిపారు.

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని శాసనసభ లోపల, వెలుపల టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించనందుకే తాము దీక్షకు దిగామని పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ర్రాష్టానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, రవాణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాలన్నింటిని విద్యుత్ ప్రభావితం చేస్తోందన్నారు. ఈ సంక్షోభానికి వైఎస్ నాంది పలికితే రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించారని చెప్పారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ దూరదృష్టితో రాష్ట్రంలో 2770 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చివరి నాలుగు సంవత్సరాల్లో కరువు వచ్చినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.