March 28, 2013

కరెంటుపై జనంలోకి..


కాకినాడ :విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టీడీపీ.. జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. రాజధాని వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా... ఏప్రిల్ 1వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ... 19వ తేదీన హైదరాబాద్‌కు తరలించి గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు.

సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. 'పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. దీనికి వైఎస్, కాంగ్రెస్సే కారమణం. బడ్జెట్‌లో కరెంటుకు టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 శాతమే ఇస్తోంది. టీడీపీ తొమ్మిదేళ్లలో రూ.1600కోట్ల మేర చార్జీలు పెంచగా... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31,200 సర్‌చార్జీలు బాదింది'' అని తెలిపారు. తాను సీఎంగా ఉండగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే విద్యుత్‌పై సమీక్షించి... ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించేవాడినని గుర్తుచేశారు. ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది.

తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్‌గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్‌రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు.

ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో కూర్చున్నవారికి మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం సీపీఎం, సీపీఐ ప్రజా ప్రతినిధులు గుండా మల్లేష్, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్నవారిని వైద్యులు ఉదయం, సాయంత్రం పరీక్షించారు. ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

కరెంటుకోతలు, చార్జీలభారంతో ప్రజలను తిప్పలు పెడుతున్న ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. దీక్షా వేదికపై నుంచి వారు మాట్లాడారు. ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేస్తోందని, వేల కోట్ల రూపాయల భారం మోపుతోందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, విద్యుత్‌ను తెచ్చుకోవడంలో విఫలం కావడమే ఈ కష్టాలకు కారణమని... 30 మంది కాంగ్రెస్ ఎంపీలు, పదిమంది మంత్రులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని విమర్శించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఈ నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం పిలుపునిచ్చింది. 1982లో ఆవిర్భవించిన టీడీపీ ఈ నెలాఖరులో తన 32వ వ్యవస్థాపక వేడుకలను జరుపుకొంటోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ పవిత్ర ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, మూడు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, కార్యకర్తల త్యాగాలు, నిస్వార్ధ సేవలు, చంద్రబాబు సారథ్యంతో ఎదిగిన పార్టీ పయనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ వేడుకలను అవకాశంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. ఆ జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రం పెద్దపూడిలో ఆయన ఇందులో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.