March 28, 2013

బాబ్లీపై వేసిన త్రిసభ్య కమిటీ పనిచేసేలా చూడాలి : టీడీపీ

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టుపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు న్యాయసలహాలు తీసుకుంటామని చెప్పారన్నారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణలోకి తీసుకొని మరోసారి అఖిల పక్షం నిర్వహిస్తామని చెప్పారన్నారు.

బాబ్లీ ప్రాజెక్టుపై వేసిన త్రిసభ్య కమిటీ కేంద్రం పరిధిలో పని చేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో త్రిసభ్య కమిటీ ఉండవద్దన్నారు. ఒక్క ప్రాజెక్టు అంతర్భాగంలో మరో ప్రాజెక్టు నిర్మించడం ఎక్కడా జరగలేదన్నారు. బాబ్లీ విషయంలో ప్రభుత్వానికి తాము కనువిప్పు కలిగించామన్నారు. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు ప్రభుత్వం తీసుకు వెళ్లాలన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించక పోవడం వల్లనే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. మహారాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించి 60 టిఎంసిలకు బదులు వంద టిఎంసిల నీటిని ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఓ వైపు కోర్టులో పోరాడుతూనే మరోవైపు రాజకీయ పరిష్కారానికి కృషి చేయాలని జూలకంటి రంగారెడ్డి సూచించారు.