March 28, 2013

దీక్షలో తొమ్మిది మందికి క్షీణించిన ఆరోగ్యం

హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరి ఆరోగ్యం గురువారం క్షీణించింది. దీక్షలో ఉన్నవారికి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యబృందాలు 9 మంది పరిస్థితి బాగోలేదని, వారికి రక్తంలో చక్కెర స్థాయి, బీపీ బాగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు గుర్తించాయి. వారిలో సీతక్క, సత్యవతి రాథోడ్, జైపాల్ యాదవ్, శివిరి సోమ, దేవినేని ఉమా మహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, కొమ్మాలపాటి శ్రీధర్, జివి ఆంజనేయులు, కె. నారాయణరెడ్డి ఉన్నారు.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఉన్నారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలతో మాట్లాడారు. పరిస్థితి అసలు బాగోలేదని వైద్యులు గట్టిగా చెబితే వారిని ఆస్పత్రికి తరలించడానికి అనుమతిస్తామని, లేనిపక్షంలో వారు దీక్షలోనే కొనసాగుతారని టీడీపీ నేతలు చెప్పారు. దాంతో ప్రస్తుతానికి వారిదీక్ష కొనసాగుతోంది. నగరంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో గురువారం దీక్షా శిబిరం కిటకిటలాడింది. గురువారం 28 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కొత్తగా దీక్షలో చేరారు. సాయంత్రానికి ఈ దీక్ష మూడో రోజుకు చేరింది.

గుమ్మడికాయల దొంగ
'విద్యుత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మేం బ్లాక్ పేపర్ విడుదల చేశాం. అధికార కాంగ్రెస్ పార్టీ దానికి కిక్కురుమనలేదు. వైసీపీ మాత్రం ఉలిక్కిపడి తానొక పత్రాన్ని మాపై విడుదల చేసింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉంది' అని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్షా శిబిరం వద్ద ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కేఎస్ రత్నంలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

అబద్ధాలు, అర్ధ సత్యాలతో ఆ పార్టీ తన పత్రాన్ని విడుదల చేసిందని ఆయన విమర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉండగా బడ్జెట్‌లో 7.8 శాతం నిధులు విద్యుత్ రంగానికి కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులను 3.9 శాతానికి తగ్గించింది. మొత్తం విద్యుత్‌లో మేం వ్యవసాయానికి 62% ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో అది 45%కు తగ్గిపోయింది. టీడీపీ హయాంలో వ్యవసాయానికి 9గంటలు ఇచ్చాం. వైఎస్ రాగానే దాన్ని 7 గంటలకు తగ్గించారు. దమ్ముంటే రండి.. ఇది నిజమో కాదో రైతుల వద్దకు వెళ్లి తెలుసుకొందాం' అని ఆయన సవాల్ విసిరారు.