March 28, 2013

పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కాకినాడ: ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో పదో రోజుకి చేరుకుంది. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు యాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాకు వచ్చిన తొలి ఐదారు రోజులూ రోజూ 14 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు మూడు రోజుల నుంచి దూరం తగ్గించారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ చంద్రబాబు 107.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర చేశారు. 29వ తేదీ నాటికి అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుంది.అక్కడి నుంచి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజవవర్గాలలో బాబు పాదయాత్ర చేపడతారు.

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.