March 28, 2013

రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబం హోల్‌సేల్‌గా దోచుకుంది

అన్నదాతను ఆదుకునేందుకు
స్వామినాథన్ సిఫారసులు అమలుచేస్తాం
పేదల కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం : చంద్రబాబు

కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో 178వ రోజు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం బిక్కవోలు, గొల్లలమామిడాడ, పెద్దాడ, పెదపూడిలలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రాన్ని ఆయన కుటుంబం హోల్‌సేల్‌గా దోచుకుందన్నారు.

రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు తాను రుణమాఫీ చేస్తానని చెబుతుంటే కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు అసాధ్యమని చెబుతున్నాయన్నారు. వారికి రైతులపై ఏమాత్రం దయాదాక్షిణ్యాలులేవన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేసి వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 300 శాతం వ్యవసాయ పెట్టుబడులు పెరిగినా పంటలకు 30 శాతం కూడా ధర పెరగలేదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా అయ్యేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ దొంగలు పేదల్ని దోచుకుని బలిసిపోయారని చంద్రబాబు విమర్శించారు. ధరల పెరుగుదల, విద్యుత్‌కోతలతో రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు, ఎక్కడైనా పంటలు ఎండిపోతే తనకు చెప్పాలని చెప్పిన పొన్నాల ఊళ్లోనే పంటలు ఎండిపోతే ఏంచేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందిరమ్మ పేరు దోచుకునేది వీరు.. అని హౌసింగ్ అమలుపై బాబు ఎద్దేవాచేశారు.

కిరణ్‌కుమార్ రెడ్డి పనికిమాలిన సీఎం అని, అన్నీ తెలుసనుకుని ప్రగల్భాలు పలుకుతారని, అవినీతి తప్ప ఏమీతెలియదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదల కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం తీసుకువస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కొంతమంది కార్పొరేట్ ఆసుపత్రుల బాగుకోసమేనన్నారు.
: వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలని బాబు పిలుపునిచ్చారు. రజకులను ఎస్సీలుగా గుర్తించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని రజక రణభేరిలో చంద్రబాబు హామీ ఇచ్చారు.