March 28, 2013

అన్నదాతను ఆదుకుంటాం

స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తాం
రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయండి
రజకులకు చంద్రబాబు పిలుపు
కిరణ్ పనికిమాలిన సీఎం అంటూ ధ్వజం

కాకినాడ: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీలుగా గుర్తించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా బిక్కవోలు, గొల్లలమామిడాడ, పెద్దాడ, పెదపూడిలలో చంద్రబాబు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రసంగించారు. నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేసి వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టేందుకు తాను రుణమాఫీ చేస్తానని చెబుతుంటే కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు అసాధ్యమని చెబుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగినా పంటల ధరలు 30 శాతం కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు ఉతికినట్లు కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయాలని బిక్కవోలు మండలంలో ఏర్పాటు చేసిన జిల్లా రజకుల సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. రజక సంఘాలను బలోపేతం చేస్తామని, దోబీఘాట్‌లు పునరిద్ధరిస్తామని, రజకులను ఎస్సీల్లోకి చేర్చేందుకు కృషి చేస్తామని హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.