March 28, 2013

విప్ ఉల్లంఘనపై స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు

ఎమ్మెల్యేలపై వేటు వేయండి

హైదరాబాద్ : శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ 9 మంది ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. వీరిలో ఏడుగురు సీమాంధ్ర నేతలు, ఇద్దరు తెలంగాణ నేతలు ఉన్నారు. విప్ ఉల్లంఘనపై ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్‌నాథరెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), సముద్రాల వేణుగోపాలాచారి (ముధోల్) ఉన్నారు.

అవిశ్వాసంపై రెండు దఫాల ఓటింగ్‌కు అందరూ హాజరైతటస్థంగా వ్యవహరించాలని టీడీపీ విప్ జారీచేసింది. అయితే... రామకోటయ్య, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగ్‌కు రాలేదు. మిగిలిన వారు వచ్చినా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవచ్చా లేదా అన్నదానిపై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి నోటీసులు జారీచేసి, సమాధానం అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.