March 29, 2013

కోతలు.. షాకులే సర్కారు ఘనతలు

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తున్న పేర్లు రెండే రెండు! కరెంటు కోతలు! కరెంటు షాకులు! కోతలతో విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలూ ఇబ్బంది పడుతుంటే.. షాకులతో పదిమందికి అన్నం పెట్టే రైతన్న అర్థంతరంగా రాలిపోతున్నాడు! పొద్దు పొద్దున్నే రైతులు కరెంటు షాకులతో చనిపోయిన వార్త చూసి మనసు చిదిమేసినట్టు అయిపోయింది. రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అన్నం పెట్టాల్సిన వాళ్ల బతుకులు గాలిలో దీపాలుగా మారాయి. దీనంతటికీ కారణం పాలకుల నిర్లక్ష్యమే. వీళ్లకు చిత్తశుద్ధి లేదు. స్పందించే హృదయం అంతకన్నా లేదు. కూడు పెట్టేవాడు వీళ్ల నిర్లక్ష్యానికి పాడెక్కే దుస్థితి వచ్చింది. కరెంటు షాకులకు రైతులు పిట్టల్లా రాలుతున్నా వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పాపం ఊరికే పోదు!

బిక్కవోలు, జి.మామిడాడల్లో పదో తరగతి విద్యార్థులు వచ్చి కలిశారు. వాళ్లకు అసలు పరీక్ష వాళ్లు రాసే పదో తరగతి పరీక్ష కాదట. కరెంటు కోతలే వాళ్ల పాలిట అగ్ని పరీక్షగా మారాయి. పరీక్షల సమయంలో గుడ్డి దీపాల కింద చదువుకోవడం ఈ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చిన బహుమతి. "లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయినా, మాకు పైసా పనులు జరగడం లేదు. ఈ డబ్బంతా ఎటుపోతోంది సార్'' అంటూ ఓ యువకుడు వేసిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ప్రజలు రక్తం చిందించి కట్టిన సొమ్ములన్నీ కాంగ్రెస్ అవినీతి ఖజానాకే చేరుతున్నాయి.

బిక్కవోలులో రజక సోదరులు కలిశారు. ఆనాటి 'ఆదరణ' లాంటి ఆదరణ కావాలని కోరారు. త్వరలోనే ఆ కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలా!!