March 29, 2013

'విద్యుత్'పై తెలుగుదేశం నిరసన

అనకాపల్లి: విద్యుత్ కోతలు, ఇంధన సర్దుబాటు చార్జీలపేరుతో అదనపు బాదుడు, వచ్చే నెల నుంచి పెంచనున్న విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనకాపల్లిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కాగడాలతో నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో ప్రజలు కాగడాలతో కాలం వెళ్లదీసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాటి రోజులను పునరావత్తం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యలపై తాము చేపట్టిన ఆందోళన ఆరంభం మాత్రమేనని, ముందు ముందు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు, బంద్‌లు చేస్తామని హెచ్చరించారు.

వచ్చే నెల నుంచి పెరగనున్న విద్యుత్ చార్జీల వల్ల ప్రస్తుతం ఐదు వందల రూపాయల బిల్లు వచ్చేవారికి ఎనిమిది వందల రూపాయలు, వెయ్యి రూపాయలు వచ్చే వారికి 1600 రూపాయల బిల్లు వస్తుందన్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక పేదలు చీకట్లో మగ్గాల్సిన దుస్థితి రాబోతున్నదన్నారు. గ్యాస్ ధర పెంచడం, సబ్సిడీ సిలిండర్లపై కోత విధించడం వల్ల ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకునేంత వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మద్దాల రమణబాబు, బొడ్డపాటి చినరాజారావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలమరశెట్టి గిరినాయుడు, అక్కిరెడ్డి రమణబాబు, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం: రాష్ట్రంలో కోతల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ అన్నారు. కోతలకు నిరసనగా గురువారం స్థానిక విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం ర్రాష్టాన్ని అంధకారంలోకి నెట్టేసిందన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోగా ఏప్రిల్ ఒకటి నుంచి గృహవసరాలకు వినియోగించే విద్యుత్ బిల్లులను 60 శాతం పెంచుతుండడం దారుణమన్నారు.

రాజీవ్ యువకిరణాలంటూ లక్షమందికి ఉద్యోగాలిచ్చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారని, ప్రస్తుతం విద్యుత్ కొరతకారణంగా ఉన్న ఉద్యోగాలు వూడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కొన్ని కర్మాగారాలు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే పేరిట మూసివేస్తున్నాయన్నారు. దీంతో సిబ్బందిని తగ్గించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకు ముందు పార్టీకార్యాలయంనుంచి ర్యాలీగా విద్యుత్ ఉపకేంద్రం వరకు వచ్చి ముట్టడించారు. విద్యుత్ బిల్లులను తగులబెట్టారు. కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ లాలంభాస్కరరావు, అచ్యుతాపురం, మునగపాక మండల టీడీపీ అధ్యక్షుడు రాజాన రమేష్‌కుమార్, దాడి ముసిలినాయుడు, కాండ్రేగుల జోగినాయుడు, కె.వెంకటరావు, పి.చిన్నయ్యనాయుడు, మేరుగు అప్పలనాయుడు, ఉమ్మిడి అప్పారావు, గూడేల కనక, రొంగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.