March 29, 2013

అసమర్థ ప్రభుత్వంతో ఇక్కట్లు


బద్వేలు : కిరణ్ సర్కార్ అసమర్థ పాలన వలనే ప్రజలు అనేక సమస్యలతో సతమతమవు తున్నారని జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు కె.రాంబాబు, తెదేపా పట్టణ అధ్యక్షుడు నరసింహనాయుడు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజల పై మోయలేని భారం మోపడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీలను అదుపు చేయాలని, విద్యుత్ సర్ ఛార్జీలను తక్షణం ఉప సంహరించుకోవాలంటూ టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో వైఎస్ఆర్ చేసిన తప్పిదాల వలనే విద్యుత్ కష్టాలకు దారి తీస్తున్నాయని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమత మవుతున్నా వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వర్గ రాజకీయాలతో కుర్చీలను కాపాడుకొనేందుకు సమయం సరిపోతుందే తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్‌ను అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపినే అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి పరిపాలనలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానికి టిడిపి కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యల్లారెడ్డి, మునిరెడ్డి, జయరామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.