March 29, 2013

టీడీపీ నేతల దీక్షకు సంఘీభావం తెలిపిన బి.వి. రాఘవులు

సభ సరిగా జరపకుండా పారిపోయిన ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవాలి

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమని ఆయన అన్నారు. ఇది తలతిక్క, తెలివితక్కువ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు టీడీపీ నేతలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఉదయం సందర్శించి, నేతలను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేతల ప్రాణాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకైనా నేతలు ప్రాణాలు నిలుపుకోవాలని, బదులుగా ఇతర నేతలు కూర్చోవాలని రాఘవులు సూచించారు.

శాసనసభ సమావేశాలు కూడా సరిగ్గా జరపకుండా ప్రభుత్వం పారిపోతోందని రాఘవులు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమకు నిజాయితీ లేదని ప్రభుత్వం ప్రకటించుకోవాలన్నారు. మలివిడత అసెంబ్లీ సమావేశాల నాటికి విద్యుత్ సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాఘవులు హెచ్చరించారు.