March 29, 2013

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆందోళన

శంకర్‌పల్లి: విద్యుత్ సమస్య పరిష్కరించటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. గురువారం రాత్రి శంకర్‌పల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, శ్రీధర్, శ్రీశైలం, పాండు, గోవిందరెడ్డి, శ్రీశైలం, ఆనందం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌లో... మొయినాబాద్: కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారమయ్యాయని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షకు సంఘీభావంగా గురువారం రాత్రి మొయినాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విద్యుత్ కోత కారణంగా గ్రామాలు అంధకారమయ్యాయని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హన్మంత్‌యాదవ్, నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, నీలకంఠం, రమేష్, రవియాదవ్, కిషన్, జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, కృపాకర్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో... శంషాబాద్: విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం మండల కేంద్రం శంషాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అజయ్, సిద్దేశ్వర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా సరిగాలేక పంటలు ఎండిపోయి రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టాలకు గురవుతున్నారన్నారు. రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఉచితకరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న కరెంటు తీసివేస్తుందని ధ్వజమెత్తారు. .

విద్యుత్ సరఫరాను ప్రభుత్వం మెరుగుపర్చేవరకు తాము ఆందోళన చేస్తుంటామని హెచ్చరించారు. వెంటనే సరఫరాను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సాయి, ప్రేం, శ్రీను, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.