March 7, 2013

స్పర్థలు వీడండి.. పార్టీని గెలిపించండి

స్పర్థలు వీడండి.. పార్టీని విజయపథంలో నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతులైన నాయకులు అవసరమన్నారు. యువతను, మహిళలను ఎంపికచేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. గుడివాడలో బుధవారం నూజివీడు, పెడన నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ విజయం.. మీ విజయంగా భావించండి. కష్టాలున్నా వెనక్కు తగ్గకండి.. బాంగారం లాంటి కార్యకర్తలున్నారు. మీరే నాబలం అంటూ చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

పరిస్థితులను బట్టి సూది మందు.. శస్త్ర చికిత్స

నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను గాడిలో పెట్టేందుకు చికిత్స అవసరం ఉందని బాబు చురక వేశారు. కొన్నిచోట్ల సూది మందు, మరికొన్ని చోట్ల శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చి కాలక్షేపం చేస్తే ప్రజలు క్షమించరన్నారు. కొందరు నాయకుల పేర్లు కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఇది దురదుష్టకరమన్నారు. నాయకుడి పేరు చెబితే ప్రజలు గుర్తు పట్టాలన్నారు. నా భారాన్ని మీ అందరూ పంచుకోవాలి నేను కష్టపడుతుంటే మీరు ఇంటి వద్ద పడుకోవాలనుకోవడం సరి కాదన్నారు. పార్టీ బలోపేతానికి మరిన్ని పాలసీలను ప్రకటించబోతున్నాం. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అందుకు నియోజకవర్గ, మండల, గ్రామాల కమిటీలను సమాయత్తం చేయాలన్నారు. ఈ సమావేశాలను నాయకులు నిర్వహించకపోవడంతో కార్యకర్తల్లో ఉన్న నైపుణ్యం, నిరుపయోగంగా మారిందని చంద్రబాబాఉ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని తాను త్రికరణశుద్ధిగా నమ్ముతున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువతను ప్రోత్సహించండి...
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నారు. సొంత కుటుంబ సభ్యులే యువతను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించి సరైన శిక్షణ ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు నాయకులకు ఉపదేశించారు.

ఎస్సీలకు న్యాయం చేసింది టీడీపీనే...

ఎస్పీలకు అన్ని విధాలా న్యాయం చేసింది తెలుగుదేశమేనని చంద్రబాబు అన్నారు. శాశ్వత గృహాలు, అందుకు అవసరమైన నిధులు కేటాయించడంలో చిత్తశుద్ధి చూపామన్నారు. ఎస్సీలకు డీకేటీ పట్టాలిస్తే వాటిని వైఎస్ రద్దు చేసి పరిశ్రమలకు కట్టబెట్టారని ఆరోపించారు. మాల, మాదిగలందరికీ న్యాయం చేశామన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్, బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసి గౌరవించింది, కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీగా నియమించింది మా హయాంలోనేనన్నారు.

హత్యా రాజకీయాలు చేస్తే ఖబడ్దార్


కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని తమ కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. చాట్రాయి మండలం చిత్తవూరికి చెందిన నెట్టెంపల్లి జోగేశ్వరరావును సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వైసీపీ హత్య చేయించిందన్నారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని పులివెందుల మార్చుదామని పిల్ల కాంగ్రెస్ నాయకులు అనుకుంటే తగిన గుణపాఠం చెబుతానన్నారు. తెలుగుదేశం రౌడీయిజాన్ని సహించదని, హత్యా రాజకీయాలను సమర్థించదన్నారు. సమీక్షా సమావేశాల్లో ఎంపీ కొనకళ్ళ నారాయణ, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు, కాగిత వెంకట్రావ్, కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.