March 7, 2013

మహిళా సాధికారత

గుడివాడటౌన్ : మహిళలు స్వశక్తితో ఆర్థిక సాధికారత సాధించాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్య పడుతుందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళా హక్కుల సాధన కోసం వందేళ్ళకు పైగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆస్తి హక్కులో వాట వచ్చిందన్నారు. యూపీఏ చైర్మన్ సోనియా, పార్లమెంట్ ప్రతిపక్ష నేత సుస్మాస్వరాజ్, స్పీకర్ మీరాకుమార్ చట్ట సభల్లో ఉన్నా 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. మహిళలు శాస్త్ర పరిశోధనా రంగాలతో పాటు రాజకీయ, క్రీడ, వ్యాపార, ఉద్యోగ, దేశ రక్షణ రంగాల్లో రాణిస్తూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని హైమావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం కైకలూరులో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

షర్మిల నీ స్థాయి ఏంటి.. కనీసం పంచాయతీ సభ్యురాలు కూడా కాని షర్మిల తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడిని విమర్శించడం హాస్యాస్పదమని హైమావతి అన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన చంద్రబాబుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అ«ధోగతి పాల్జేసిన రాజశేఖరరెడ్డికి పోలికా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానంటున్న ఆమె వైఎస్ పాలనలో 22వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ముదిగొండ, సోంపేటల్లో రైతులపై కాల్పులు జరిపించారు.

కొడుకు ధనదాహం తీర్చేందుకు పేదల భూములను దోచి బడా కంపెనీలకు దారాదత్తం చేశారనిఆరోపించారు. స్థాయి మరచి చంద్రబాబును విమర్శిస్తే మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, జిల్లా కార్యదర్శి తమ్మినీడు గంగాభవానీ, పట్టణ అధ్యక్షురాలు బొడ్డు శివశ్రీ, రేమల్లి కమలకుమారి, ఎస్.తులసీరాణి పాల్గొన్నారు.