March 7, 2013

ఎమ్మెల్సీ టికెట్లలో సామాజిక న్యాయం

దానికే పెద్దపీట వేస్తానని చంద్రబాబు వెల్లడి

టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే ఉద్దేశంలో ఉన్నానని గురువారం కృష్ణా జిల్లాలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన చేసిన ప్రకటనతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ముస్లిం, ఎస్సీ మాదిగ, బ్రాహ్మణ, బీసీ, మహిళ, వికలాంగ వర్గాలతోపాటు పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన తనకు ఉందని, అయితే పార్టీకి వచ్చేవి మూడు సీట్లే అయినందువల్ల అవకాశం ఉన్నమేరకు చోటుకల్పిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆయన చెప్పిన సామాజిక సమీకరణాల్లో ముస్లింల నుంచి హైదరాబాద్ నగర నేత సలీం, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి పోలీస్ శాఖ మాజీ ఉన్నతాధికారి రావులపాటి సీతారామారావు పేర్లు ముందుకొచ్చాయి. ఈ వర్గాల నుంచి ఆయన ఎంపిక చేయదలిస్తే వీరికే అవకాశం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీ మస్కతి గురువారం చంద్రబాబును కలిసి మాట్లాడినా ఆయన పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు చెబుతూ.. దాడి వీరభద్రరావు పేరును కూడా ప్రస్తావించారు. అదే సమయంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.

ఎక్కువ అవకాశాలు దాడికే ఉన్నాయని, లేని పక్షంలో పంచుమర్తి అనూరాధ, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి పేర్లను పరిశీలనకు తీసుకోవచ్చని అంటున్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు బక్కాని నర్సింహులు, శమంతక మణి, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి. శ్రీశైలం పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వికలాంగ వర్గాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ వర్గానికి చెందిన పార్టీ నేత కోటేశ్వరరావు ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని.. అలాంటి వారినీ పట్టించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

వీటితోపాటు మరో రెండు కోణాలను ఆయన ప్రస్తావించారు. తన సొంత జిల్లా చిత్తూరుకు ఇంతవరకూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయానని, అలాగే ఏ అవకాశాలు రాకపోయినా పార్టీని దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఆయన ప్రస్తావించిన వర్గాలు చాలా ఉండి సీట్లు మూడే ఉండటంతో వీటిలో ఏవో మూడు వర్గాలకే అవకాశం దక్కుతుందన్నది పార్టీవర్గాలకు స్పష్టమై పోయింది. పార్టీ విధేయుల గురించి బాబు చేసిన ప్రస్తావన ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ వంటి వారిలో ఆశలు రేకెత్తించింది. మహిళా కోటాలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు కూడా ప్రచారంలో ఉంది.