March 7, 2013

తెలంగాణపై ఇతర పార్టీల ట్రాప్‌లో పడొద్దు

అవిశ్వాసం వాళ్లనే పెట్టనీ...
వారి బలమెంతో తేలిపోతుంది
వైసీపీ పెడితే మనమూ మద్దతు ఇద్దాం!
బేరాల కోసమే మనపై ఒత్తిడి
అసెంబ్లీకి నేను రాకపోవచ్చు
మొహమాటంలేకుండా రెచ్చిపోండి
బీసీ, మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం
ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టీకరణ
కృష్ణా జిల్లాలో టీడీఎల్పీ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయాన్ని జగన్ పార్టీకే వదిలేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. "ప్రజా సమస్యలపైనే అవిశ్వాసం పెడతాం. అంతేతప్ప... ఎవరో డిమాండ్ చేశారని మనం అవిశ్వాసం పెట్టాల్సిన అవసరంలేదు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూటిగా చెప్పారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రల్లో ఉన్న చంద్రబాబు... గురువారం కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని దాకరం వద్ద శాసనసభాపక్ష (టీడీఎల్పీ) సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.

'పిల్ల కాంగ్రెస్' బేరసారాల కోసం టీడీపీ అవిశ్వాసం పెట్టదని చంద్రబాబు తేల్చి చెప్పారు. "వైసీపీ అధికారిక బలం 17 మంది మాత్రమే. మరో 14 మంది జంప్ జిలానీలు వారికి అనుకూలంగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొంటే... ఈ 14 మందిపై అనర్హత వేటు పడుతుంది. పిల్ల కాంగ్రెస్ ఈ విషయాలు చెప్పకుండా... అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ మనపై ఒత్తిడి తెస్తోంది'' అని చంద్రబాబు వివరించారు. సూట్‌కేస్ బేరాల కోసమే మరోసారి అవిశ్వాసం అంటోందని విమర్శించారు. వైసీపీ అవిశ్వాసం ప్రవేశపెడితే దానికి టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని వివరించారు. అయితే.. 155 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ నుంచి 8 మంది చేజారారని, ఇంకొందరు అటూ ఇటుగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అంత తేలికగా పడిపోదని అభిప్రాయపడ్డారు. వైసీపీ అవిశ్వాసం పెడితే... ఎవరి డ్రామా ఏమిటో తేలిపోతుందన్నారు.